Home » Health Science  » ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ ప్రమాదమా.. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి!

ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ ప్రమాదమా..  ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి!

ప్రతి మహిళ వివాహం అయ్యాక గర్బం దాల్చాలని,  సుఖంగా ప్రసవం కావాలని కోరుకుంటుంది.  గర్బవతిగా ఉన్న మహిళ విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఇదే కోరుకుంటారు. కానీ ప్రసవం వరకు ఉన్న పరిస్థితి వేరు.. ప్రసవం తర్వాత ప్రతి తల్లి ఎదుర్కునే పరిస్థితులు వేరు.. ప్రసవం తర్వాత గడిచే కాలం చాలామంది మహిళలకు చాలా క్లిష్టంగా ఉంటుంది.  శారీరక పరంగా వచ్చే మార్పులు, హార్మోన్ మార్పులు, నిద్రలేమి,  అలసట,  అప్పుడే  పుట్టిన బిడ్డను చూసుకోవడం.. ఇలా చాలా విషయాలు మహిళల మీద ప్రబావం చూపిస్తాయి.  ఇవి కాస్తా చాలామంది మహిళలను డిప్రెషన్ లోకి నెట్టేస్తాయి.  ప్రసవం తర్వాత వచ్చే ఈ డిప్రెషన్ ప్రమాదమా?  తెలుసుకుంటే..

ప్రసవం తర్వాత డిప్రెషన్..

ప్రసవానంతర డిప్రెషన్ (PPD) అనేది ప్రసవం తర్వాత కొంతమంది మహిళల్లో ఏర్పడే ఒక మానసిక ఆరోగ్య సమస్య. ఇది సాధారణ "బేబీ బ్లూస్"కు భిన్నమైనది. బేబీ బ్లూస్ సాధారణంగా కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి, అయితే ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు వారాలు లేదా నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది, పైగా   వీటికి చికిత్స కూడా అవసరం కావచ్చు.

ప్రసవం తర్వాత డిప్రెషన్ లక్షణాలు..

బిడ్డను కన్న తర్వాత  మహిళ  కొన్ని రోజులు లేదా వారాల పాటు ఎప్పుడూ విచారంగా ఉన్నా, కారణం లేకుండా ఏడ్చినా, లేదా దేనిలోనూ ఆనందాన్ని పొందలేకపోయినా, అది ప్రసవానంతర డిప్రెషన్‌కు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి క్రమంగా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

బిడ్డ ఆరోగ్యం గురించి సాధారణంగా తల్లికి ఆందోళన సహజమే, కానీ ఎప్పుడూ భయపడుతూ, ఆందోళనగా, లేదా భయంగా ఉంటూ,  కుదురుగా ఉండలేక,  తన భయాన్ని,  ఆందోళనను నియంత్రించుకోలేకపోతే,  అలాంటి పరిస్థితి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లో భాగమే.. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.


ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళ ఎక్కువగా నిద్రపోవచ్చు లేదా అసలు నిద్రపోకపోవచ్చు. అదేవిధంగా, నీరసంగా లేదా విపరీతమైన ఆకలిగా అనిపించడం వంటి సమస్య కూడా ఉండవచ్చు.

కొంతమంది మహిళలు తమకు పుట్టిన బిడ్డతో ఎమోషనల్ గా ఉండలేకపోవడం,  వారితో ప్రేమగా ఉండలేకపోవడం వంటి  పరిస్థితిలో ఉంటారు.  వారు బిడ్డను చూసుకోవడంలో తక్కువ ఆసక్తి చూపవచ్చు లేదా అపరాధ భావనతో బాధపడవచ్చు. ఇది కూడా ప్రసవానంతర డిప్రెషన్‌కు ఒక ముఖ్యమైన లక్షణమే.

ప్రసవం తర్వాత మహిళ తనకు తాను హాని కలిగించుకోవడం,  ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం లేదా బిడ్డకు హాని కలిగించడం వంటి ఆలోచనలు చేస్తే అది తీవ్రమైన మానసిక ఆరోగ్య  పరిస్థితి కావచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.

ఏ మహిళలకు ప్రసవం తర్వాత డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ?

గతంలో డిప్రెషన్ లేదా ఆందోళన కలిగి ఉన్న మహిళలు,   కుటుంబం నుండి తగినంత మానసిక మద్దతు లభించని మహిళలు,  ఆర్థిక లేదా కుటుంబ ఒత్తిడిలో ఇబ్బంది పడే మహిళలు, నెలలు నిండకనే  ముందుగా ప్రసవం జరగడం లేదా ప్రసవం చాలా కష్టంగా జరగడం వంటివి జరిగిన మహిళలు,  కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన మహిళలు, . చాలా రోజుల పాటు సరైన నిద్ర లేకుండా  మానసికంగా తీవ్రంగా అలసిపోయిన మహిళలు.. ఇలాంటి వారికి ప్రసవం తర్వాత డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.

                                         *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.