Home » Health Science » మహిళలకు నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే ప్రమాదమా? వైద్యులేం చెప్తున్నారంటే!
మహిళలకు నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే ప్రమాదమా? వైద్యులేం చెప్తున్నారంటే!

నెలకు ఒకసారి రుతుస్రావం కావడం సాధారణమే. సాధారణంగా ఆడపిల్లలలో రుతుచక్రం మొదలైనప్పుడు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఆ తరువాత చాలా ఏళ్ల వరకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన మహిళకు నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది. అయినప్పటికీ కొందరు మహిళలకు నెలకు రెండుసార్లు పీరియడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది మహిళలకు ఆందోళన కలిగించే విషయం. అయితే, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక మహిళకు నెలకు రెండుసార్లు పదేపదే రుతుస్రావం అవుతుంటే, ఆమె వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకాకుండా, ఈ రోజుల్లో మహిళల్లో రుతుస్రావానికి సంబంధించిన అనేక సమస్యలు సాధారణంగా ఉంటున్నాయి. నెలకు రెండు సార్లు పీరియడ్స్ రావడం గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
ఋతుచక్రాన్ని అర్థం చేసుకోవాలి..
సాధారణంగా, ఋతు చక్రం 28 రోజులు ఉంటుంది, కానీ అది 21 నుండి 35 రోజుల మధ్య ఉంటే, దానిని సాధారణంగా పరిగణిస్తారు. అయితే ఋతు చక్రం 21 రోజుల కంటే తక్కువగా లేదా 36 రోజుల కంటే ఎక్కువగా ఉంటే, లేదా దాని తేదీలు నెలనెలా చాలా వ్యత్యాసంగా మారితే, దానిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా పరిగణిస్తారు. ఒత్తిడి లేదా జీవనశైలి మార్పుల కారణంగా ఋతుస్రావం అప్పుడప్పుడు హెచ్చుతగ్గులకు గురికావడం కూడా పూర్తిగా సాధారణమే. అయితే, ఇది పదేపదే లేదా ఎక్కువసార్లు జరిగితే, అది శరీరానికి ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది.
నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడానికి కారణాలు..
హార్మోన్ల అసమతుల్యత..
నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడానికి హార్మోన్ల హెచ్చుతగ్గులే అత్యంత సాధారణ కారణం. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఋతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, పీరియడ్స్ క్రమరహితంగా మారతాయి. నెలలో ఒకటి కంటే ఎక్కువసార్లు పీరియడ్స్ రావచ్చు. అధిక ఒత్తిడి లేదా జీవనశైలిలో మార్పులు ఈ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయగలవని అర్థం చేసుకోవడం ముఖ్యం.
PCOS..
PCOS అనేది ఒక సాధారణ హార్మోన్ల సమస్య, దీనివల్ల నెలసరి క్రమరహితంగా ఉండవచ్చు. నెలకు రెండుసార్లు కూడా రావచ్చు. ఈ పరిస్థితిలో మహిళల అండాశయాలలో చిన్న తిత్తులు ఏర్పడతాయి, ఇవి నెలసరి సక్రమంగా రావడంలో అంతరాయం కలిగిస్తాయి.
గర్భాశయ ఫైబ్రాయిడ్లు..
గర్భాశయ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయంలో ఏర్పడే చిన్న గడ్డలు. ఈ గడ్డలు ఉన్న ప్రదేశాన్ని బట్టి , వాటి పరిమాణాన్ని బట్టి, అధిక రక్తస్రావం లేదా నెలసరిలో క్రమరాహిత్యం ఉండవచ్చు, కొన్నిసార్లు నెలసరి నెలకు రెండుసార్లు కూడా రావచ్చు.
థైరాయిడ్ సమస్యలు..
హైపర్‌థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు ఋతుచక్రాన్ని అస్తవ్యస్తం చేయగలవు. ఈ వ్యాధులు థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి, దీనివల్ల పీరియడ్స్ సమయం, రక్తస్రావం జరగడంలో మార్పులు వస్తాయి.
*రూపశ్రీ.

