Home » Fashion » స్కార్ఫ్ ధరించడంలోనూ ఫ్యాషన్ ఉండాలండోయ్.. ఇలా ట్రై చేస్తే అదిరిపోతారు..!
స్కార్ఫ్ ధరించడంలోనూ ఫ్యాషన్ ఉండాలండోయ్.. ఇలా ట్రై చేస్తే అదిరిపోతారు..!

స్కార్ఫ్ లు అమ్మాయిల వస్త్రాధారణలో ప్రధానంగా ఉంటాయి. ఇవి అమ్మాయిలను అటు స్టైలిష్ గా కనిపించేలా చేస్తూ మరొక వైపు చలి నుండి రక్షణ ఇస్తాయి. ఇంకా డీప్ గా ఆలోచిస్తే ఆడిపిల్లలకు చున్నీ లాగా స్కార్ఫ్ లు కాస్త సేఫ్టీ కల్పిస్తాయి. ప్రస్తుతం వణికిస్తున్న చలిలో స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించాల్సిందే. ముఖ్యంగా డ్రైవింగ్ లో ఉన్నప్పుడూ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడూ స్కార్ఫ్ వాడటం తప్పనిసరి. అయితే దీన్ని సౌకర్యం కోసమే కాకుండా స్ట్రైల్ గా కూడా కనిపించడానికి చాలా రకాలుగా ధరించవచ్చు. చాలా కాజువల్ గా ఉండే డ్రస్సులకు కూడా మంచి లుక్ ను ఇవ్వడంలో స్కార్ఫ్ లు బాగా సహాయపడతాయి. స్కార్ఫ్ లు ధరించడానికి కొన్ని స్టైల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
క్లాసిక్ డ్రేప్..
ఇది చాలా సులభమైన పద్దతి, అంతే కాదు ఇది సీజన్ కు తగ్గట్టు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మెడ చుట్టూ స్కార్ఫ్‌ను ఉంచి, రెండు చివరలను ముందు భాగంలో వదులుగా వేలాడదీయాలి. ఈ స్టైల్ ఉన్ని కోట్లు, బ్లేజర్‌లతో చాలా బాగుంటుంది. ఇది సౌకర్యాన్నే కాకుండా ట్రెండీగా కనిపించేలా చేస్తుంది. అలాగే చలిలో వెచ్చగా కూడా ఉంచుతుంది.
ది స్నగ్ ర్యాప్..
ఈ స్టైల్ ఫాలో అవ్వడానికి మొదట జాకెట్ ధరించి ఉండాలి. స్కార్ఫ్ ని మెడ చుట్టూ ఒకసారి చుట్టుకుని, చివరలను జాకెట్ లోపల పెట్టుకోవాలి. ఈ స్టైల్ వెచ్చగా ఉంచుతుంది. అలాగే చాలా చక్కగా కనిపిస్తుంది. ఆఫీసుకి వెళ్లడానికి, లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది.
పారిసియన్ లూప్..
ఇండియన్ లుక్ కి కాస్త యూరోపియన్ ఫ్లెయిర్ జోడించాలనుకుంటే ఈ స్టైల్ ఫాలో కావచ్చు. స్కార్ఫ్ ని సగానికి మడిచి మెడ చుట్టూ చుట్టుకుని, లూప్ ద్వారా వదులుగా ఉండే చివరలను లూప్ చేయాలి. ఈ స్టైల్ చాలా అందంగా ఉంటుంది. అలాగే ఫార్మల్ వింటర్ వేర్ లేదా స్ట్రక్చర్డ్ కోట్స్ తో బాగా సెట్ అవుతుంది.
ది ర్యాప్ -అరౌండ్..
ఈ స్టైల్ పెద్దగా మృదువుగా ఉన్న స్కార్ఫ్‌లకు అనువుగా ఉంటుంది. స్కార్ఫ్‌ను మెడ చుట్టూ రెండు లేదా మూడు సార్లు లూజ్ గా చుట్టాలి. వీకెండ్స్ లో లేదా నార్మల్ గా టూర్స్ కు అలా వెళ్లినప్పుడు పెద్ద కోటు లేదా మందపాటి స్వెటర్ ధరించినప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది.
ది బెల్టెడ్ డ్రేప్..
స్టైలిష్ గా ఉంటూ "స్ట్రీట్-స్టైల్" లుక్ కావాలి అంటే స్కార్ఫ్‌ను నేరుగా ముందు భాగంలోకి వంచి నడుము వద్ద బెల్ట్‌తో భద్రపరచాలి. ఇది చాలా స్పెషల్ లేయర్డ్ ఎఫెక్ట్‌ను కనిపించేలా చేస్తుంది. ఈ స్టైల్ లాంగ్ కోట్లు, మంచి రంగులో ఉన్న దుస్తులతో బాగా కనిపిస్తుంది.
లూజ్ త్రో-ఆన్స్..
క్యాజువల్, రిలాక్స్డ్ లుక్ కోసం, స్కార్ఫ్‌ను భుజాలపై శాలువా లాగా కప్పుకోవాలి. ఇది కేఫ్ డేట్‌లకు, రద్దీ లేకుండా ఉండే ఆఫీస్ డేస్ లో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి సరైనది. ఈ స్టైల్ స్కార్ఫ్ ఆకృతిని వింటర్ కలర్స్ కు బాగా హైలెట్ చేస్తుంది.
టక్డ్-ఇన్ లుక్..
స్కార్ఫ్‌ను మెడ చుట్టూ ఒకసారి చుట్టి, చివరలను కోటు లేదా జంపర్ కింద చక్కగా అమర్చాలి. ఇది రోజంతా చక్కగా చెదిరిపోకుండా ఉండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ శీతాకాలంలో మంచి ఛాయిస్ అవుతుంది.
*రూపశ్రీ.

