Home » Beauty Care » మొటిమల నుండి టానింగ్ వరకు.. ముల్తానీ మట్టి చేసే మ్యాజిక్ ఇది!
మొటిమల నుండి టానింగ్ వరకు.. ముల్తానీ మట్టి చేసే మ్యాజిక్ ఇది!

చర్మ సంరక్షణలో చాలా మంది ముల్తానీ మట్టి వాడుతుంటారు. ఇది అదనపు నూనెను పీల్చుకుని, చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలామంది ముల్తానీ మట్టిని ముఖ , చర్మ సంరక్షణకు సహజమైన ఎంపికగా భావిస్తారు. అందుకే నేటికీ అందుబాటులో ఉన్న అనేక ఫేస్ ప్యాక్‌లు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ముల్తానీ మట్టిని ఉపయోగిస్తున్నారు. అయితే ముల్తానీ మట్టి అందరికీ ఒకే విధంగా పని చేయదు, అలాగే అన్ని చర్మాలకు ఒకే విధంగా ఫలితాన్ని ఇవ్వదు. సరైన పద్దతిలో ఉపయోగిస్తే.. ముల్తానీ మట్టి చర్మం మీద మొటిమల నుండి, ట్యానింగ్ వరకు.. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
జిడ్డు చర్మానికి, మొటిమలకు..
ముల్తానీ మట్టి అదనపు నూనెను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. అందుకే జిడ్డు చర్మం ఉన్నవారు దీనిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. అదనపు నూనెను తగ్గించడం వల్ల కొంతమందిలో మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే, మొటిమలకు అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి అన్నిసార్లు మొటిమలు తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పలేం.
బ్లాక్ హెడ్స్, టానింగ్..
చర్మంపై ఉన్న మురికిని, అధిక నూనెను తొలగించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. ఇది బ్లాక్‌హెడ్స్ తక్కువగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. ఎండలో చర్మం కమిలిన తర్వాత, పెరుగు, కలబంద జెల్ లేదా రోజ్ వాటర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. అయితే.. చర్మంపై ఉన్న నల్లదనం ఎంత వేగంగా పోవడమనేది వ్యక్తి యొక్క చర్మంపై ఆధారపడి ఉంటుంది.
మచ్చలు, పిగ్మెంటేషన్..
నార్మల్ స్కిన్ కేర్ లో భాగంగా ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. కొందరు దీనిని పసుపు, కలబంద జెల్ లేదా చందనం పొడితో కలిపి అప్లై చేసుకుంటారు. నల్ల మచ్చలు లేదా పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి కూడా ముల్తానీ మట్టిని వాడతారు. వారానికి కనీసం రెండుసార్లు వాడుతూ ఉంటే.. కొన్ని వారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
ఓపెన్ పోర్స్..
ముల్తానీ మట్టి చర్మానికి స్పష్టమైన మరియు మ్యాట్ రూపాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది, దీనివల్ల చర్మ రంధ్రాలు పెద్దవిగా కాకుండా చిన్నవిగా మారతాయి. వీటినే ఓపెన్ పోర్స్ అంటూ ఉంటారు. అయితే ఇది రంధ్రాల పరిమాణాన్ని శాశ్వతంగా తగ్గించదు. ముఖం కడుక్కున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవడం, పగటిపూట సన్‌స్క్రీన్ పూసుకోవడం వంటివి చేస్తే ముఖ చర్మ రంధ్రాలు చిన్నవిగా మారతాయి.
సరైన విధంగా ఎలా వాడాలి..
ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, పెరుగు లేదా కలబంద జెల్‌తో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి 10-15 నిమిషాల పాటు అప్లై చేయాలి. పూర్తిగా ఆరిపోకముందే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు దీనిని ఉపయోగించడం సరిపోతుంది.
*రూపశ్రీ.
