Home » Fashion » Designer Nagala Soyagalu
Designer Nagala Soyagalu
డిజైనర్ నగల సోయగాలు
మగువల అలంకరణలో నగలకి ఎనలేని ప్రాధాన్యత ఉంది. మారుతున్న కాలానికనుగుణంగా నగలు ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనవుతూ స్త్రీల అలంకరణలో తమ స్థానాన్ని చాటి చెబుతూనే ఉన్నాయి. వనితలు తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకోడానికి ఎన్నో రకాల దుస్తులు, ఆభరణాలు ఉపయోగిస్తుంటారు.
ప్రాచీనకాలం నుండీ ఆభరణాలు మగువాల మనసులు దోస్తూ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురౌతూ వచ్చాయి. గత కొన్ని ఏళ్లుగా ఫ్యాషన్ ప్రభావితం చేయని అంశం లేదు. దుస్తులు, పాదరక్షలు, గృహోపకరణాలు ఇలా ఒక్కటేమిటి దాదాపు మన జీవితంలోని ప్రతి అంశానీ ఫ్యాషన్ ప్రభావితం చేస్తోంది. నగల విషయంలోనూ ఫ్యాషన్ కొత్త ట్రెండ్ సృష్టించింది.
* దుస్తులకు తగ్గ నగలను వేసుకుంటే వారి వ్యక్తిత్వంలో మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదు. బంగారం, వెండి, పూసలతో పాటు వివిధ రకాల రాళ్ళు పొదిగిన వెండి ఆభరణాలపై మహిళలు ఆసక్తి చూపుతున్నారు. బంగారం , వెండి మాత్రమే కాదు కొన్ని ఇతర లోహాల కాంబినేషన్ లో జ్యూయలరీ తయారీ చేస్తున్నారు. దీనికి కారణం సాంప్రదాయ ఆభరణాలకి మోడరన్ లుక్ ఇవ్వలనుకోవటమే.
* ఒకానొక సమయంలో నేవీ బ్లూ, గులాబీ రంగు రాళ్ళన్న ఆభరణాలు ఎబ్బెట్టుగా ఉంటాయనుకునేవారు. కానీ ప్రస్తుతం డిజైనర్ జ్యూయలరీలో ఈ రంగు రాళ్లనే ఎక్కువగా వాడుతున్నారు. అందుకే దుస్తుల మాదిరిగానే నగల తయారీలోనూ ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ నగలు ఒక ప్రాంతం, ఒక దేశం అన్న తేడ లేకుండా మగువలమనసులు దోచేస్తునాయి.
* సౌదర్యంతో పాటు సౌభాగ్యం: మగువల అందాన్ని పెంచాడంలోనే కాదు వారికి ఆర్థిక భద్రతా కల్పించడంలో ముఖ్యమైన్ పాత్రను పోషిస్తున్నాయి నగలు. బంగారు నగల విషయానికొస్తే భారతీయ మహిళలు పెట్టుబడులు పెట్టే సమయంలో నగలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాలక్రమంలో మహిళలు ఇతర లోహాలతో తయారు చేసిన నగలను ఉపయోగిస్తున్నప్పటికీ భారతీయ వనితలకు బంగారు నగలపై ఉన్న మోజు, అనుబంధం ఏమాత్రం తగ్గటం లేదు.
* ఇండో వెస్ట్రన్ డిజైన్ లకి పెరిగిన ఆదరణ: మంచి ముత్యాలు, వివిధ రంగు రాళ్ళను పొదిగి తయారు చేసే ఇండో వెస్ట్రన్ డిజైన్లను ఇష్టపడని వారు ఉండరు. ఏ తరహా ఆభరణాలు ఎప్పటికీ కొత్తగా అనిపిస్తాయి. హుందాతనాన్ని కలిగిస్తాయి. ఇండో వెస్ట్రన్ జ్యూయలరీ డిజైన్లలో పెండేంట్, ఉంగరాలు, బ్రెస్ లేట్, కంఠాభారణాలు, చెవి దుద్దులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి చిన్నా, పెద్ద సంబంధం లేకుండా మహిళలు వీటిని ఇష్టపడుతున్నారు.