Home » Yoga » Benefits Of Shavasana
Benefits Of Shavasana
ఆసనాల్లో మకుటాయమానం - శవాసనం
* యోగ సాధనలో శవాసనం (savasana)ఎంతో ముఖ్యమైంది. శవాసనాన్ని "మృతాసన" అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం అని అర్థం. మృతి చెందినప్పుడు ఎలా పడుకోబెడతామో శవాసనం లోనూ అలా పడుకుంటారు. ఇతర యోగాసనాలన్నింటి కంటే ఇది చాలా తేలికైన ఆసనం. అయితే దీనిపైన పూర్తి పట్టు సాధించడం కష్టమే. యోగాసనాలకు మధ్యలోగాని, అన్ని ఆసనాలు పూర్తయ్యాక శరీరం, మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందడానికి ఈ ఆసనం అద్భుతమైంది.
* ఉదయం యోగాసనాలతో పాటు మాత్రమే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు, అలా చేయడం వలన మనస్సు, శరీరం పూర్తి విశ్రాంతి పొందుతాయి. మనస్సు .శాంతంగా వుంటుంది. ఈ ఆసన సమయంలో శరీరం అంతటా ప్రాణశక్తి తిరుగుతూ వున్నట్టుగా అనిపించడం ఈ ఆసనం యొక్క ప్రత్యేకత.
శవాసనం వలన పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా సహజ సిద్ధమైంది కనుక మనస్సును, శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకు వెళుతుంది. శరీరానికీ మనస్సుకూ విశ్రాంతి అవసరమైన సమయంలో శవాసనం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంద్ర స్థాయిలో శ్లోకాలు లేదా మనస్సుకు హాయిని గొలిపే పాటలు లేదా మాటలు వింటూ ఈ ఆసనం ఆచరిస్తే ధ్యానస్థితిని చేరుకుంటాము.
శవాసనం చేసే పద్ధతిః
* నేలపై తివాచీ లేదా పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ ఒకటి లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు.
* రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి.
* ఏవైపుకు వుంచితే హాయిగా వుంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి వుంచాలి.
* కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి.
* విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా వుంచాలి.
* మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలుః మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా, వేదనగా, కోపంగా చికాకుగా, దిగులుగా ఆందోళనగా అలిపిపోయినట్లుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా వున్నపుడు శవాసనం ఎంతో ఉపయోగకారిగా వుంటుంది. శరీర కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.
* కండరాలు పూర్తి విశ్రాంతిని పొంది, ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్పిస్తుంది. దృష్టిని మనస్సు పైన కూడ కేంద్రీకరించడం వలన మెదడు బాగా విశ్రమిస్తుంది. వీపు వెనుక దిగువ భాగాన లేదా పొత్తికదుపు నొప్పి వున్నా శవాసనం ఉపశమనం కల్పిస్తుంది.
* అలసటకు, ఒత్తిడికి గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం, ఆయా భాగాలకు విశ్రాంతిని కలిగించవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం వుంటుంది. ప్రెగ్నెంట్ గా వున్న సమయంలో పగటి పూట ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా వున్నప్పుడు శవాసనం వేయవచ్చు.
సాధారణ ప్రయోజనాలు
* తలనొప్పి, తలతిరగడం, మానసిక నీరసం, చికాకు, తుంటి నరం నొప్పిలాంటి వాటి నుంచి ఉపశమనం.
* శరీరం మనస్సు పూర్తి విశ్రాంతి పొందుతాయి. శరీర భాగాలన్నింటికీ ఈ అనుభూతి తెలుస్తుంది.
* మనస్సు కేంద్రీకరణ స్థాయి పెరుగుతుంది.
* బాగా వ్యాయామం చేసి అలిసి పోయాక కండరాలకు విశ్రాంతి అవసరం. ఈ ఆసనం వేస్తే కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి, ప్రశాంతత ఏర్పడుతుంది.
* శరీరంలోని అన్ని అవయవాలు నిర్వహించే పనులకు ఆక్సిజన్ అవసరం. ఇది రక్తం ద్వారా లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ అవసరమైతే రక్త ప్రసరణ కూడా అధికం అవుతుంది. ఈ ఆసనం వల్ల రక్తనాళాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. శవాసనం వేసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ నెమ్మదిస్తుంది. అన్ని శరీర భాగాల కార్య కలాపాలు నెమ్మదిగా జరుగుతాయి.
* ఈ ఆసనాన్ని ఆచరించినట్లయితే అంతరంగిక కార్య కలాపాలన్నీ తగ్గిపోయి, శ్వాస తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు తిరిగి ఈ ప్రక్రియ అంతా నెమ్మదిగా కొత్తగా ప్రారంభమవుతుంది.
* దీర్ఘకాలంగా, తీవ్రంగా జబ్బున పడిన వ్యక్తుల శరీరం మనస్సు తిరుగి కోలుకుంటుంది.
* శవాసనం మనిషిని బాగా ఉత్సాహపరుస్తుంది. మళ్ళీ తాజాగా శరీరం తయారై పని చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.
* నిద్రలేమి, అధిక లేదా తక్కువ రక్తపోటు, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది.రక్త ప్రసరణ తిరిగి మామూలు స్థితికి వస్తుంది.
* హృదయ సంబంధనైన వ్యాధులు, మానసిక వత్తిళ్ళు, అలసట, స్వల్ప దిగులు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* క్రమం తప్పకుండా ఈ ఆసనం వేసినట్లయితే కోపం అదుపులో వుంటుంది.
* చికాకు పరిచే ఆలోచనలు ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.