Home » Yoga » yoga asanas that improve your bone health
ఈ ఆసనాలతో మహిళలలో ఎముక బలం రెట్టింపు అవుతుంది!
మనిషి శరీరం దృఢంగా ఉండటంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలహీనంగా ఉంటే బరువు ఎత్తడం నుండి సరిగ్గా నిలబడటం వరకు ఏ పనీ సరిగ్గా చేయలేరు. ముఖ్యంగా ఎక్కువ శాతం ఎముకలకు సంబంధించిన సమస్యలు అన్నీ మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంటి పనులు, గర్భం, ప్రసవం, ఆపరేషన్లు మహిళలల ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి. అయితే ఎముకల బలం రెట్టింపు కావాలన్నా ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గాలన్నా ఈ కింది యోగా ఆసనాలు బాగా సహాయపడతాయి.
ఉత్కటాసనం..
ఉత్కటాసనం వేస్తే తొడలు, పొత్తి కడుపు, తుంటి భాగంలో ఎముకలు బలంగా మారతాయి.
దీన్ని ఎలా చేయాలంటే..
ఉత్కటాసనం వేయడానికి ముందు నిటారుగా నిలబడాలి. రెండు చేతులను పైకి ఎత్తి మెల్లిగా నడుము భాగాన్ని కిందకు దింపాలి. ఈ ప్రయత్నంలో భుజాలు, వెన్నుపూస బెండ్ కాకూడదు.
పైకెత్తిన చేతులు రెండూ కలిపి నమస్కారం ముద్రలో ఉంచాలి. కాళ్లూ, తొడలు బెండ్ చేయకుండా కేవలం నడుము భాగాన్ని మాత్రమే కిందకు వంచి వెన్నును స్టడీగా ఉంచితే ఉత్కటాసనం భంగిమ వేసినట్టే. ఈ భంగిమలో 30సెకెన్ల పాటూ ఉండి ఆ తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి.దీన్ని నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేయాలి.
సేతు బంధాసనం..
సేతుబంధాసనం వీపు భాగాన్ని, తొడలను, తుంటి భాగాన్ని బలంగా మారుస్తుంది. ఈ భాగంలో ఎముకలు దృఢం అవుతాయి.
సేతుబంధాసనం ఎలా వేయాలంటే..
ఈ ఆసనం వేయడానికి మొదట వెల్లికిలా పడుకోవాలి. కాళ్లను పైకి లేపి మోకాళ్ల దగ్గర మడిచి పాదాలను భూమికి ఆనించాలి.
ఇప్పుడు రెండు చేతులను తలకు రెండు వైపులా పక్కనే నేలకు ఆనించాలి. పాదాల వేళ్ల బలంతో భూమిని నెట్టుతూ తొడలు, నడుము ప్రాంతాన్ని పైకి లేపాలి. అదేవిధంగా అరచేతులతో నేలను బలంగా నెట్టుతూ తల, భూజాలు, ఛాతీని పైకి లేపాలి. ఇలా లేపిన తరువాత మోకాళ్ల నుండి ఛాతీ, తలభాగం వరకు సమాంతరంగా ఉంటుంది. ఇది వంతెనను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని సేతు బంధాసనం అంటారు. ఈ భంగిమలో గాలి పీలుస్తూ కాసేపు అలాగే ఉండి ఆ తరువాత తిరిగి నార్మల్ పొజిషన్ కు రావాలి.
త్రికోణాసనం..
త్రికోణాసనం వేయడం చాలా సులభం. కాళ్లూ రెండూ దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి. పాదాలను స్టైయిట్ గా కాకుండా కాస్త ఎడంగా అటూ ఇటూ ఉంచాలి. తరువాత కుడి కాలి పాదాన్ని కుడివైపుకు తిప్పాలి.
ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. చేతులు రెండూ చాచి ఉంచాలి. ఎడమ వైపుకు వంగినప్పుడు ఎడమ చెయ్యి ఎడమ పాదానికి తగులుతుంది. కుడి చెయ్యి నిటారుగా పైకి నిలబడినట్టు ఉంటుంది. అలాగే కుడివైపుకు వంగినప్పుడు కుడి చెయ్యి కుడి పాదానికి తగులుతుంది, ఎడమ చెయ్యి నిటారుగా పైకి నిలబడినట్టు ఉంటుంది. ఆ భంగిమలు వేస్తున్నప్పుడు కళ్లు పైన నిటారుగా ఉన్న చెయ్యివైపు చూస్తుండాలి. ఇదే త్రికోణాసనం. ఈ ఆసనాన్ని కుడివైపు 10సార్లు, ఎడమ వైపు 10సార్లు చెప్పున రోజూ వేస్తుంటే కాళ్ళు, చేతులు, నడుము, ఛాతీ అన్ని భాగాలలో ఎముకలూ దృఢంగా మారతాయి.
*నిశ్శబ్ద.