Home » Baby Care » పిల్లలకు టీ, కాఫీ ఇస్తున్నారా..ఈ ప్రమాదాలుంటాయని తెలుసా.!

టీ, కాఫీలు భారతీయులకు చాలా ఎమోషనల్ డ్రింక్స్.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయాన్నే కాఫీ లేదా టీ కచ్చితంగా సిద్దమవ్వాల్సిందే.. పెద్దలు కాఫీ, టీలు తాగుతుంటే.. పిల్లలు పాలు తాగడం జరుగుతుంది. కానీ కొన్ని ఇళ్లలో పిల్లలు కూడా కాఫీ, టీ చాలా ఇష్టంగా తాగుతుంటారు. పిల్లలు ఇలా కాఫీ, టీ తాగడం పెద్దగా సమస్య లేదని, ఇదేమంత ఇష్యూ కాదని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ చిన్న వయసులోనే పిలలలకు కాఫీ, టీ లు ఇవ్వడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులో పిల్లలు కాఫీ, టీ తాగడానికి అలవాటు పడితే కలిగే నష్టాల గురించి పిల్లల ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుంటే..
పిల్లలకు కాఫీ, టీ ఎందుకు ఇవ్వకూడదు?
పిల్లలు టీ లేదా కాఫీ తాగుతున్నట్లయితే, ఆ అలవాటును వెంటనే మాన్పించాలని చిన్న పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ , కాఫీ అస్సలు ఇవ్వకూడదు. అలాగే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉంచాలట.
హార్మోన్స్ ప్రభావం..
పిల్లలకు తగినంత నిద్ర లేకపోతే , వారి శరీరంలో పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. ఇది వారి పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా, క్రమం తప్పకుండా టీ, కాఫీ తాగడం పిల్లలలో కెఫిన్ వ్యసనానికి దారితీయవచ్చు. టీ, కాఫీ లు తాగే పిల్లలు నిద్రలేమి సమస్యతో బాధపడటం ఎక్కువ ఉంటుంది.
ఆరోగ్యం..
టీ , కాఫీ తాగడం వల్ల పిల్లల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. ఇది వారి ఆకలిని తగ్గించి, చిరాకు, అశాంతి , ఆందోళనను పెంచుతుంది. అంతేకాకుండా, ఇది పిల్లల నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట తరచుగా నిద్రకు అంతరాయం కలగడం, ఉదయాన్నే త్వరగా మేల్కొకోపవోడం.. మొత్తంమీద వారి నిద్ర సమయం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
చక్కెర శాతం..
టీ, కాఫీలలో చక్కెర వాడకం తప్పనిసరి. చిన్న పిల్లలకు శరీరానికి అవసరమైనంత గ్లూకోజ్ వారి ఆహారంలోనే లభిస్తుంది. పిల్లలు తీసుకునే ఇతర ఆహారాలలో కూడా గ్లూకోజ్, చక్కెరలు ఉంటాయి. అవి కాకుండా మళ్లీ కాఫీ, టీ లు తీసుకుంటే వాటిలో ఉండే చక్కెర కారణంగా చిన్నతనంలోనే డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ
