Home » Fashion » సింపుల్ చీరే.. కానీ లుక్ మాత్రం స్టన్నింగ్!
.webp)
భారతీయ గౌరవ వస్త్రధారణలో చీరకు చాలా గొప్ప స్థానం ఉంది. కొన్నేళ్ళ కిందటి వరకు ఫ్యాషన్ మాయలో పడి చీరకట్టు విషయంలో యువతులు కాస్త అనాసక్తి చూపించినా, ప్రస్తుతం మాత్రం చీరను కూడా ఫ్యాషన్ తో గ్రాండ్ గా మెరిపిస్తున్నారు. అయితే చీర ఎంత గ్రాండ్ గా లేదా క్లాస్ గా ఉంటే అంత అందం అనుకునేవారు.. కానీ ప్లెయిన్ చీరలు పెద్దగా బాగోవు అని కొందరి నమ్మకం. అయితే సరైన రీతిలో స్టైల్ చేస్తే ప్లెయిన్ చీర కట్టుకున్నా కూడా అమ్మాయిలు అద్బుతంగా కనిపించవచ్చు. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో డిజైనర్ చీరల కంటే సాదా చీరలను వేర్వేరు రకాలుగా ధరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. చాలామందికి సాదా చీర కట్టుకుంటే సింపుల్‌గా కనిపిస్తామేమో అనే అనుమానం ఉంటుంది. కానీ, చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సాదా చీరతోనే అద్భుతమైన రాయల్ లుక్ పొందవచ్చు. ఇందుకోసం ఏం చేయాలి? సాదా చీరతో ఎలిజెంట్ లుక్ ఎలా సాధించవచ్చో వివరంగా తెలుసుకుంటే..
హైలైట్ చేసే బ్లౌజ్ డిజైన్లు
సాదా చీరకి మొదటి ప్రధాన ఆకర్షణ బ్లౌజ్ . చీర ఎంత ప్లెయిన్ గా ఉంటే, బ్లౌజ్ డిజైన్ అంత కొత్తగా, గ్రాండ్ గా ఉండాలి. హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్, బ్రోకేడ్, బెనారస్ లేదా జర్దోసీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులు సాదా చీరపై చాలా బాగా నప్పవుతాయి. అలాగే మోచేతుల వరకు ఉండే హాఫ్ స్లీవ్స్, డిజైనర్ నెక్ లైన్స్, లేదా కాంట్రాస్ట్ రంగుల బ్లౌజులను ఎంచుకోవడం వల్ల చీర అందం రెట్టింపు అవుతుంది. చీర ప్లెయిన్‌గా ఉన్నప్పుడు బ్లౌజ్‌పై ప్రింట్లు లేదా మోటిఫ్స్ ఉండేలా చూసుకోవడం మంచిది.
ఆకట్టుకునే ఆభరణాల ఎంపిక..
ప్లెయిన్ చీర కట్టుకునేటప్పుడు ఆభరణాలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చీరపై ఎక్కువ హంగులు లేవు కాబట్టి జ్యువెలరీ బాగా ఎలివేట్ అవుతుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ, స్టేట్మెంట్ నెక్లెస్ లేదా హెవీ జుంకాలు సాదా చీరకి ట్రెండీ లుక్ ఇస్తాయి. మెడలో పెద్ద హారం వేసుకుంటే చెవులకు చిన్న టాప్స్ పెట్టుకోవడం, లేదా కేవలం పెద్ద జుంకాలతో మెడను ఖాళీగా వదిలేయడం వంటి బ్యాలెన్సింగ్ పద్ధతులు పాటిస్తే లుక్ చాలా క్లాసీగా కనిపిస్తుంది.
గాజులు తోడైతే మరింత అందం..
చేతులకు తొడిగే గాజులు చీర కట్టుకు కంప్లీట్ లుక్ తెస్తాయి. సాదా చీర కట్టుకున్నప్పుడు చీర రంగుకు సరిపోయే గాజులతో పాటు కాంట్రాస్ట్ రంగుల మట్టి గాజులు లేదా మెటల్ గాజులు మిక్స్ చేసి వేసుకోవడం వల్ల అందమైన లుక్ వస్తుంది. ఒక చేతికి పెద్ద వాచ్ లేదా ఒకే ఒక స్టేట్మెంట్ కడా తొడిగి, మరో చేతికి సన్నటి గాజులు వేసుకోవడం నేటి తరం ఎక్కువగా ఇష్టపడే మోడరన్ ఫ్యాషన్.
హ్యాండ్ బ్యాగ్స్ , ఫుట్‌వేర్..
సాదా చీర ధరించినప్పుడు మన దగ్గర ఉండే ఇతర వస్తువులు కూడా లుక్‌ని పెంచుతాయి. ఎంబ్రాయిడరీ చేసిన క్లచ్ లేదా పొట్ల బ్యాగ్ వంటివి పట్టుకోవడం వల్ల స్టైల్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనితో పాటు సంప్రదాయమైన జుట్టీలు లేదా వీలైనంత వరకు కంఫర్ట్‌గా ఉండే హీల్స్ వేసుకోవడం వల్ల నడకలో ప్రత్యేకమైన గ్రేస్ కనిపిస్తుంది.
హెయిర్ స్టైల్, మేకప్..
సాదా చీరలో మరింత అందంగా కనిపించాలంటే మేకప్, హెయిర్ స్టైల్ కూడా శ్రద్ధగా ఎంచుకోవాలి. మెరిసే లుక్ కోసం లిప్‌స్టిక్ రంగు కాస్త బ్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి. కళ్లకు కాటుక, ఐలైనర్ వేసి, ముఖానికి చిన్న బొట్టు పెడితే సాంప్రదాయ అందం ఉట్టిపడుతుంది. హెయిర్ స్టైల్ విషయంలో వదులుగా ఉన్న జుట్టు, సాఫ్ట్ కర్ల్స్ లేదా మల్లెపూలతో వేసిన కొప్పు సాదా చీరపైకి చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటాయి.
ఈ చిన్న చిన్న ఫ్యాషన్ టిప్స్ పాటిస్తే, సాధారణ సాదా చీర కూడా ఏదైనా ఫంక్షన్ లేదా ప్రత్యేక సందర్భంలో అందరి దృష్టినీ ఆకర్షించేలా మారుతుంది.
*రూపశ్రీ.

