Home » Beauty Care » మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా.. ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!
మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చెయ్యండి..!
.webp)
చాలామంది స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే మోకాళ్లు, మోచేతుల దగ్గర మాత్రం సరిగా కేర్ తీసుకోరు. మోకాళ్లు మోచేతులు బాగా గమనిస్తే.. చాలామందిలో ఈ ప్రాంతాలలో చర్మం నల్లగా కాస్త గరుకుగా, గట్టిగా మారి ఉంటుంది. కొందరికి మాత్రం మోకాళ్లు, మోచేతుల చర్మం నల్లగా కాకుండా సాధారణ చర్మం రంగులో ఉంటుంది. కానీ ఈ ప్రాంతాలలో నలుపును తొలగించుకోవడం కష్టం అనుకుంటారు. మోకాళ్ల, మోచేతుల రంగు సాధారణంగా మారాలంటే ఏం చేయాలో, ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే..
హైపర్పిగ్మెంటేషన్..
మోకాళ్లు, మోచేతుల ప్రాంతంలో కాలక్రమేణా మృతకణాలు పేరుకుపోవడం, ఘర్షణ కారణంగా నల్లగా, గరుకుగా మారుతుంది. వైద్య పరిభాషలో దీనిని హైపర్పిగ్మెంటేషన్ అంటారు, ఇది అధిక మెలనిన్ పేరుకుపోవడం వల్ల వస్తుంది. మోచేతులు, మోకాళ్లపై చర్మంలో తక్కువ నూనె గ్రంథులు ఉంటాయి. దీనివల్ల ఈ ప్రాంతాలు పొడిబారడం, ధూళికి గురవడం జరుగుతాయి. ఖరీదైన మార్కెట్లో లభించే క్రీములకు బదులుగా వంటగదిలో లభించే సహజ పదార్థాలతో దీన్ని పోగొట్టుకోవచ్చు.
నిమ్మకాయ, చక్కెర స్ర్కబ్..
నిమ్మకాయ విటమిన్ సి అధికంగా ఉండే సహజ బ్లీచింగ్ ఏజెంట్, ఇక చక్కెర స్పటికాలు అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తాయి. నిమ్మకాయను సగానికి కట్ చేసి దానిపై కొంచెం చక్కెర చల్లుకోవాలి. మోచేతులు, మోకాళ్లపై 5-10 నిమిషాలు రుద్దాలి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించడమే కాకుండా నల్లటి మచ్చలను తేలికపరచడంలో కూడా సహాయపడుతుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ చిట్కాను ఫాలో అవ్వాలి.
బేకింగ్ సోడా, పాలు పేస్ట్..
బేకింగ్ సోడా చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పాలు చర్మాన్ని తేమగా మారుస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా పాలతో కలిపి మందపాటి పేస్ట్ లా చేయాలి. మోకాళ్లు, మోచేతుల ప్రాంతంలో అప్లై చేసి, వృత్తాకారంగా స్క్రబ్ చేసి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది, క్రమంగా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
అలోవెరా జెల్, కొబ్బరి నూనె..
పొడిబారడం అనేది నల్లటి మచ్చలకు ప్రధాన కారణం, కాబట్టి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. కలబంద జెల్ లోని అలోయిన్ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. పడుకునే ముందు చర్మానికి తాజా కలబంద జెల్, కొబ్బరి నూనె మిశ్రమాన్ని పట్టించి మసాజ్ చేయాలి. ఈ పద్ధతి చర్మాన్ని బాగు చేసి మృదువుగా చేస్తుంది, నల్లటి మచ్చలు తిరిగి రాకుండా చేస్తుంది.
కేరింగ్.. కంటిన్యూటీ..
ఏ ఇంటి చిట్కాలు అయినా కేవలం ఒక్క రాత్రిలోనే ఫలితాలను చూపించదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఓపికతో కంటిన్యూగా ప్రయత్నం చేయడం చాలా అవసరం. సూర్యరశ్మిలోకి వెళ్లే ముందు ఈ ప్రాంతాలకు సన్‌స్క్రీన్ రాయడం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే UV కిరణాలు నల్లబడటాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అలాగే పుష్కలంగా నీరు త్రాగాలి. మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీకు ఏవైనా చర్మ అలెర్జీలు లేదా కోతలు ఉంటే, ఈ చిట్కాలు ప్రయత్నించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
*రూపశ్రీ.

