Home » Beauty Care » హోలీ రంగులతో అమ్మాయిలు మీ అందం జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!
హోలీ రంగులతో అమ్మాయిలు మీ అందం జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

హోలీ అంటే రంగుల పండుగ. ఒకరికి ఒకరు రంగులు చల్లుకోవడంలోనే హోలీ ఆనందం దాగి ఉంటుంది. అయితే రంగులు ఎంత సహజమైనవి అయినా అవి చర్మం మీద, జుట్టు మీద పడ్డాక ఎంతో కొంత హాని చేయకుండా ఉండవు. ఇక కృత్రిమ రంగులు అయితే ఈ హాని మరీ ఎక్కువ ఉంటుంది. హోలీ తర్వాత, చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారడం, మొటిమలు, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే హోలీ తర్వాత కూడా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుంటే..
హోలీకి ముందు..
హోలీ ఆడటానికి కనీసం 20-30 నిమిషాల ముందు ముఖం, శరీరంపై మాయిశ్చరైజర్‌ను పూర్తిగా రాసుకోవాలి.
కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె లేదా హెవీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పూసుకోవాలి. నూనె లేదా క్రీమ్ చర్మంపై ఒక ప్రొటెక్షన్ లేయర్ ను సృష్టిస్తుంది. రంగులు నేరుగా చర్మంలోకి చొచ్చుకుపోకుండా నిరోధిస్తుంది.
హోలీని ఎక్కువగా ఎండలో ఆడతారు కాబట్టి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మర్చిపోకూడదు.
మేకప్..
భారీ మేకప్ వాడటం మానుకోవాలి. ఫౌండేషన్, పౌడర్, రంగులతో పాటు, చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. తేలికపాటి లిప్ బామ్, వాటర్ ప్రూఫ్ కాజల్ అప్లై చేసుకోవచ్చు, కానీ చర్మానికి, చర్మ రంధ్రాలకు గాలి ప్రసరణ జరిగేలా ఉండాలి.
జుట్టుకు..
హోలీ ఆడటానికి ముందు జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం. రంగులు వేసే ముందు కొబ్బరి నూనె, ఆవాల నూనె లేదా ఆర్గాన్ నూనె రాయవచ్చు. ఈ నూనె జుట్టు కుదుళ్లను కప్పి, రంగు చొచ్చుకుపోకుండా నిరోధిస్తుంది.
అలాగే రంగులు వేసే ముందు జుట్టును వదులుగా ఉంచకుండా జాగ్రత్త పడాలి. జడ లేదా బన్స్ వేసుకుంటే బెటర్. స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం మరింత మంచిది.
తడి జుట్టు వద్దు..
తడి జుట్టు ఎక్కువ రంగును గ్రహిస్తుంది. అందుకే హోలీ ఆడే ముందు జుట్టు పొడిగా ఉంచుకోవడం, జుట్టుకు నూనె రాసుకోవడం మంచిది.
హోలీ తర్వాత..
హోలీ తర్వాత వెంటనే స్క్రబ్ లేదా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సబ్బును ఉపయోగించకూడదు.
ముందుగా సాధారణ నీటితో రంగును తొలగించుకోవాలి. తరువాత తేలికపాటి క్లెన్సర్ తో కడగాలి. అలోవెరా జెల్ ను చర్మానికి అప్లై చేయాలి.
జుట్టు కోసం..
తేలికపాటి షాంపూతో జుట్టు కడగాలి, తరువాత డీప్ కండిషనర్ అప్లై చేయాలి. హోలీ రంగుల నుండి క్లీన్ అవ్వాలనే ఉద్దేశంతో రోజుకు 2-3 సార్లు షాంపూ చేయకూడదు. దీనివల్ల జుట్టు మరింత పొడిగా మారుతుంది.
చర్మంపై దద్దుర్లు ఉంటే..
హోలీ రంగుల వల్ల చర్మం పై దద్దుర్లు ఉంటే చల్లటి నీటితో కడగాలి. కాలమైన్ లోషన్ రాయాలి. అవసరమైతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. దురదగా ఉంటే రుద్దకూడదు.. లేకుంటే చర్మం దెబ్బతింటుంది.
*రూపశ్రీ.
