Home » Fashion » బ్లాక్ శారీ కట్టినప్పుడు ఈ గాజులు వేసుకుంటే అధిరిపోతారు..!
బ్లాక్ శారీ కట్టినప్పుడు ఈ గాజులు వేసుకుంటే అధిరిపోతారు..!

ఫ్యాషన్ ప్రపంచంలో నలుపు రంగుకు ఉండే ప్రత్యేకతే వేరు. నలుపు రంగుకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే నలుపు రంగును బాగా ఇష్టపడే అమ్మాయిలు మాత్రం తమ దగ్గర ఖచ్చితంగా ఒక్కటైనా నలుపు రంగు చీర ఉండేలా చూసుకుంటారు. ఏ వేడుకలోనైనా, ఏ పార్టీలోనైనా నలుపు రంగు చీర కట్టుకుంటే అందరి చూపు మీ మీదే ఉంటుంది. ఈ అందమైన చీరకు తగ్గట్టుగా చేతికి మంచి గాజులు వేసుకుంటే లుక్ మరింత అద్భుతంగా మారుతుంది. ఏ రంగు చీరకైనా గాజులు సరిగ్గా కుదిరితే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. నలుపు రంగు చీరతో ఏ రంగు గాజులు జత చేస్తే బాగుంటుందో వివరంగా తెలుసుకుంటే..
గోల్డ్ కలర్..
సాధారణంగా నలుపు రంగు చీరకు బంగారు రంగు గాజులు ఎప్పుడూ నప్పుతాయి. చీర మీద ఏమాత్రం బంగారు రంగు అంచు లేదా పూల డిజైన్ ఉంటే ఈ రంగు గాజులు మరింత అందాన్ని తెస్తాయి. కొన్ని సన్నని బంగారు గాజుల మధ్యలో ఒకటి రెండు వెడల్పుగా ఉండే కంకణాలు వేసుకుంటే చేతులు చాలా కళకళలాడుతూ కనిపిస్తాయి. పెళ్లిళ్లు లేదా పండుగ సమయాలలో ఈ రకమైన లుక్ చాలా బాగుంటుంది.
ఎరుపు రంగు..
నలుపు చీరకు ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల ఒక మంచి లుక్ క్రియేట్ అవుతుంది. ఎరుపు రంగు గాజులు నలుపు రంగుతో కలిసి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎరుపు రంగు గాజులతో పాటు ఒకటి రెండు బంగారు కంకణాలు వేసుకుంటే ఆ లుక్ మరింత డిఫరెంట్ గా మారుతుంది. చీర ఎలాంటి అంచులు లేకుండా సాదాగా ఉంటే ఈ ఎరుపు రంగు గాజులు చేతులకు సరిగ్గా సరిపోతాయి.
న్యూ లుక్ కోసం వెండి రంగు..
కొంచెం కొత్తగా కనిపించాలనుకునే వారు వెండి రంగు లేదా ఆక్సిడైజ్డ్ గాజులను ఎంచుకోవచ్చు. వెండి రంగు కంకణాలు లేదా మెరిసే గాజులు నలుపు రంగు చీరకు సరికొత్త అందాన్ని తెస్తాయి. సాయంత్రం వేళల్లో జరిగే పార్టీలకు లేదా చిన్నపాటి వేడుకలకు ఈ రకమైన గాజులు వేసుకుంటే హుందాతనం మరింత పెరుగుతుంది.
ఆకుపచ్చ రంగు..
ఆకుపచ్చ రంగు గాజులు కూడా నలుపు చీరకు చాలా చక్కగా సరిపోతాయి. ముదురు ఆకుపచ్చ రంగు గాజులు నలుపు రంగుతో కలిసి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. వీటిని కొన్ని బంగారు గాజులతో కలిపి వేసుకోవచ్చు. పండుగ రోజుల్లో ఇలా వేసుకోవడం వల్ల చాలా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. అలాగే ఎక్కువ హంగులు లేకుండా సింపుల్ గా ఉండాలనుకునే వారు ముత్యాలు లేదా చిన్న రాళ్లు పొదిగిన గాజులను ఎంచుకోవచ్చు. ఇలా అభిరుచికి తగ్గట్టుగా సరైన గాజులను ఎంచుకుంటే నలుపు రంగు చీరలో అందం రెట్టింపు అవుతుంది.
*రూపశ్రీ.
