Home » Fashion » అనుకోని అహ్వానాలు వచ్చాయా.. చీరల్లోకి బ్రౌజ్ కుట్టించుకునే టైం లేదా.
అనుకోని అహ్వానాలు వచ్చాయా..చీరల్లోకి బ్లౌజ్ కుట్టించుకునే టైం లేదా..ఈ టిప్స్ ట్రై చేయండి..!

అనుకోని ఆహ్వానాలు అందగానే ఏ కార్యక్రమానికైనా వెళ్లడానికి మనమంతా అత్యుత్సాహం చూపుతాం. ముఖ్యంగా మహిళలు అయితే ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి అనే ఆలోచనలో పడిపోతారు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో అసలు సమస్య ఎదురవుతుంది. అదే ఆ చీరకు సరిపడే బ్లౌజ్ సమయానికి కుట్టించుకోకపోవడం లేదా టైమ్‌కి అందుబాటులో లేకపోవడం. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది అవాక్కై అసలు ఆ చీరనే కట్టాలా వద్దా అని సతమతమవుతుంటారు. కానీ కాస్త ఆలోచిస్తే బ్లౌజ్ లేకపోయినా కూడా చాలా సులభంగా, సరికొత్తగా చీరను కట్టుకుని అద్భుతమైన లుక్ సొంతం చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా కొత్త బ్లౌజ్‌ల కోసం పరుగులు పెట్టాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ దుస్తులను తెలివిగా జత చేసి పండగలకు లేదా ప్రత్యేక వేడుకలకు అదిరిపోయే లుక్ పొందవచ్చు. అలాంటి సందర్భాలలో ఏమాత్రం ఆందోళన చెందకుండా కొన్ని స్టైలింగ్ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల టెన్షన్ కూడా ఉండదు. ఆ స్టైలింగ్ చిట్కాలేంటో తెలుసుకుంటే..
మ్యాచ్ చేయండి డిఫరెంట్ గా..
మీ వార్డ్‌రోబ్‌లో ఇప్పటికే ఉన్న ఇతర బ్లౌజ్‌లను కాంట్రాస్ట్ పద్ధతిలో ట్రై చేయవచ్చు. ఉదాహరణకు ఒక మంచి రంగు చీరకు సరిగ్గా అదే రంగు బ్లౌజ్ లేకపోయినా, దానికి నప్పే వేరే రంగు బ్లౌజ్‌ను జత చేయడం ద్వారా సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ముదురు రంగు చీరలకు కాంట్రాస్ట్ రంగులలో ఉండే బ్లౌజ్‌లు వేస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే డిజైనర్ లేదా హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్‌లను వేరే ప్లెయిన్ చీరలతో మ్యాచింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫ్యూజన్ లుక్‌ను పొందవచ్చు.
క్రాప్ టాప్స్..
కేవలం బ్లౌజ్లే కాకుండా ఇంట్లో ఉండే అందమైన క్రాప్ టాప్స్‌ని కూడా చీరతో జత చేయవచ్చు. మంచి ఫిట్టింగ్ ఉన్న సాటన్, సిల్క్ లేదా ప్లెయిన్ ప్యాబ్రిక్ క్రాప్ టాప్స్ సంప్రదాయ చీరలకు సరికొత్త మోడర్న్ లుక్‌ను అందిస్తాయి. కొద్దిగా ఎంబ్రాయిడరీ లేదా షిమర్ వర్క్ ఉన్న టాప్స్‌ని ఎంచుకుంటే అది పండగ లేదా పార్టీ వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది. టాప్ పొడవు , ఫిట్టింగ్ చీర కట్టే విధానానికి సరిగ్గా సరిపోయేలా చూసుకుంటే లుక్ ఎంతో అందంగా మారుతుంది.
ఫిట్టింగ్ కుర్తీస్..
చిన్నపాటి ఫిట్టింగ్ కుర్తీలను కూడా చీరలతో స్టైల్ చేయవచ్చు. మీ దగ్గర ఉన్న సింపుల్ లేదా తక్కువ ఎంబ్రాయిడరీ ఉన్న కుర్తీని చీరతో జత చేయడం ద్వారా డిఫరెంట్ స్టైల్ ను క్రియేట్ చేయవచ్చు. ముఖ్యంగా ప్లెయిన్ చీరలపైకి డిజైనర్ కుర్తీలను వేయడం వల్ల చాలా ట్రెండీగా కనిపించవచ్చు. అయితే కుర్తీ మరీ పొడవుగా లేదా లూజ్‌గా లేకుండా చూసుకోవడం మంచిది.
జాకెట్ స్టైల్..
మరొక పద్ధతి.. జాకెట్ స్టైల్. మీ దగ్గర ఏదైనా ఎంబ్రాయిడరీ ఉన్న చిన్న జాకెట్ లేదా ఎథ్నిక్ జాకెట్ ఉంటే దానిని చీరతో అద్భుతంగా మ్యాచ్ చేయవచ్చు. లోపల ఏదైనా సాధారణ టాప్ లేదా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి దానిపైన జాకెట్ వేసి చీరను డ్రేప్ చేస్తే రూపురేఖలే మారిపోతాయి. ఇది సంప్రదాయ వస్త్రధారణకు ఒక ఆధునిక హంగును అద్ది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి అనుకోని ఆహ్వానాలు వచ్చినప్పుడు బ్లౌజ్ రెఢీగా లేదని దిగులు చెందకుండా ఈ సులభమైన ప్రత్యామ్నాయాలను పాటిస్తే ఏ వేడుకలోనైనా ప్రత్యేకంగా మెరిసిపోవచ్చు.
*రూపశ్రీ.

