Home » Beauty Care » పచ్చిపాలు ఇలా వాడితే చర్మానికి మ్యాజిక్కే..!
పచ్చిపాలు ఇలా వాడితే చర్మానికి మ్యాజిక్కే..!

ఆడవాళ్లు అయినా, మగవాళ్లు అయినా ముఖం ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మగవారి కంటే ఆడవారే చర్మ సంరక్షణలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. అందుకే మహిళలు ఎక్కువగా చర్మ సంరక్షణ కోసం క్రీమ్స్, లోషన్లు, క్లెన్సర్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటికంటే కూడా పచ్చిపాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే పచ్చిపాలను వాడే విధానం, వీటితో పేస్ మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ వంటివి తయారు చేసుకునే విధానం మీద ఇది ఆధారపడి ఉంటుంది. పచ్చిపాలను వాడటం వల్ల ముఖం మీద మచ్చలు, నల్లటి మచ్చలు తొలగడమే కాకుండా మృతకణాలు తొలగి క్రమంగా చర్మ ఛాయ మెరుగుపడుతుంది. దీని కోసం ఏం చేయాలో.. పచ్చిపాలను ఎలా వాడాలో తెలుసుకుంటే..
ఫేస్ మాస్క్..
నేటి కాలంలో స్కిన్ కేర్ లో భాగంగా ఫేస్ మాస్క్ లు వాడటం చాలా మంచిది. ఫేస్ మాస్క్ ల వల్ల చర్మం లోతుగా శుభ్రపడుతుంది. అవి తేమను కూడా అందిస్తాయి. ఫేస్ మాస్క్‌లు మొటిమలు, మచ్చలు నివారించడంలో కూడా సహాయపడతాయి . ఇవి దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మతు చేయడానికి కూడా సహాయపడుతాయి.
ఇంట్లో పచ్చిపాల మాస్క్.. ఎందుకు మంచిదంటే..
మార్కెట్లో చాలా రకాల మాస్క్‌లు అందుబాటులో ఉండటాయి. చర్మానికి ఉండే ప్రతి సమస్యకు ఒక్కో మాస్క్ ఉంటుంది. అయితే ఈ మాస్క్‌లలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు అందరి చర్మానికి సరిపోతాయని చెప్పలేం.. పైగా వాటిని ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు జరగకపోగా, నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. చర్మానికి రసాయన మాస్క్‌ల వల్ల చికాకు కలగకూడదంటే.. సహజ పదార్ధాలతో తయారు చేసిన ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు మంచి ఛాయిస్ అవుతాయి.
కావలసిన పదార్థాలు..
పచ్చిపాలు.. తగినన్ని
కలబంద జెల్
రోజ్ వాటర్..
తయారీ విధానం..
ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. అందులో కలబంద జెల్ వేసుకోవాలి. ఇందులోనే కాసిన్ని పచ్చిపాలు, కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ ద్రావణాన్ని రాత్రి పడుకునే 10 నిమిషాల ముందు అప్లై చేయాలి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని వెంటనే కడిగేయకూడదు. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి.
దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చర్మం మీద మచ్చలు తగ్గుతాయి. చర్మం తాజాగా మృదువుగా మారుతుంది. చర్మం మీద గీతలు కూడా క్రమంగా తగ్గి, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అయితే దీన్ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిది.
ఇలా కూడా వాడవచ్చు..
పైన చెప్పుకున్న విధంగా పచ్చిపాలు, రోజ్ వాటర్, కలబంద కాంబినేషన్ లోనే కాకుండా.. పచ్చిపాలను నేరుగా.. కాటన్ బాల్ తో ముంచుకుని ముఖమంతా అప్లై చేయాలి. ఆ తరువాత ఆరిపోయాక కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది.
*రూపశ్రీ.
