Home » Beauty Care » నల్లటి చర్మాన్ని కాంతివంతంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవి!
నల్లటి చర్మాన్ని కాంతివంతంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవి!

చాలామంది చర్మం రంగును బట్టి అందాన్నినిర్ణయిస్తూ ఉంటారు. చర్మం తెల్లగా నాజుగ్గా ఉంటే.. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా కూడా చూస్తూ ఉంటారు. కానీ నిజానికి అందం అంటే.. మెరుస్తూ, ఆరోగ్యంగా ఉన్న చర్మమే.. ఛామన చాయగా, నల్లగా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా మార్చుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. దుమ్ము, ధూళి, బయటి వాతావరణ కాలుష్యం మొదలైనవి చర్మం రంగును, చర్మం మెరుపును ప్రభావితం చేస్తాయి. కొన్ని సులువైన చిట్కాలు పాటిస్తుంటే.. చర్మం రంగును కాపాడుకోవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చే సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
శుభ్రత..
దుమ్ము, చెమట , కాలుష్యం చర్మపు కాంతిని తగ్గిస్తాయి. రోజుకు రెండుసార్లు తేలికపాటి ఫేస్ వాష్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. . పడుకునే ముందు తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎక్స్ఫోలియేట్ చేయాలి. చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి సున్నితమైన స్క్రబ్ చాలా అవసరం. ఇది చర్మపు కాంతిని మెరుగుపరుస్తుంది. అతిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మపు కాంతి పెరగదు, పైగా అతిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి హాని కలిగుతుంది. కాబట్టి స్క్రబ్ ను జాగ్రత్తగా ఉపయోగించాలి.
ఇంటి చిట్కాలు..
వంటగదిలో చర్మానికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా పదార్థాలు ఉంటాయి. పెరుగు, పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ టానింగ్‌ను తగ్గించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. శనగపిండి, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడి, చర్మంలో జిడ్డును నియంత్రిస్తుంది. పచ్చి పాలు సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తాయి. కలబంద జెల్ చర్మాన్ని ఉపశమనం చేసి, కాంతివంతంగా చేస్తుంది. వీటిని ప్రతిరోజూ కాకపోయినా, వారానికి 2-3 సార్లు ఉపయోగించాలి. అయితే, ఉపయోగించే ముందు తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిది.
సూర్యుడి వెలుగు..
ముదురు రంగు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, అది ఎండదెబ్బకు , పిగ్మెంటేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ వాడాలి. ప్రతి 3-4 గంటలకు సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఎండలో స్కార్ఫ్ లేదా టోపీ ధరించాలి. తీవ్రమైన ఎండకు వీలైనంత దూరం ఉండటం మంచిది.
తేమ..
పొడి చర్మం కాంతివంతంగా ఉండదు. చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. రాత్రిపూట బాదం లేదా కొబ్బరి నూనె వంటి తేలికపాటి నూనెను రాసుకోవాలి. చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది చర్మ కాంతిని పెంచి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది.
ఆహారం, నిద్ర..
చర్మ సౌందర్యం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను తినాలి. పండ్లలో బొప్పాయి, నారింజ, దానిమ్మ వంటివి తినాలి. కూరగాయలలో పాలకూర , క్యారెట్‌ను చేర్చుకోవాలి. ప్రతిరోజూ 7-8 గ్లాసుల నీరు త్రాగాలి. జంక్ ఫుడ్, అధిక చక్కెర గల ఆహారాలకు దూరంగా ఉండాలి.. కడుపులోని మలినాలు చర్మం పైభాగాన్ని నల్లబరుస్తాయి. కాబట్టి ఆహారం మీద దృష్టి పెట్టాలి.
ఆహారం మాత్రమే కాకుండా తగినంత నిద్ర కూడా చాలా అవసరం. శరీరానికి , మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. యోగా లేదా తేలికపాటి ధ్యానం చేయడం ఎంతో మంచిది.
*రూపశ్రీ.

