Home » Beauty Care » చలికాలంలో పెదవుల మూలలు పగులుతున్నాయా..ఈ చిట్కాలతో తగ్గంచుకోండి..!
చలికాలంలో పెదవుల మూలలు పగులుతున్నాయా..ఈ చిట్కాలతో తగ్గంచుకోండి..!

చలికాలం వచ్చిందంటే చాలు, చర్మం పొడిబారడం, పెదవులు పగలడం వంటి సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. ముఖ్యంగా చాలా మందికి పెదవుల మూలలు పగిలి విపరీతమైన మంట, నొప్పి పుడుతుంటాయి. దీనివల్ల నవ్వాలన్నా, మాట్లాడాలన్నా, ఏమైనా తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ చలికాలంలో పెదవుల మూలల్లో వచ్చే పగుళ్లను సులభంగా ఎలా తగ్గించుకోవాలో కొన్ని చక్కని చిట్కాలు తెలుసుకుంటే..
కారణాలు..
పెదవుల మూలలు పగలడానికి ప్రధాన కారణం తేమ తగ్గిపోవడం. చలి గాలికి చర్మం తన సహజమైన నూనెలను కోల్పోతుంది. దీనివల్ల పెదవులు, వాటి మూలలు పొడిబారి పగిలిపోతాయి. కొన్నిసార్లు శరీరంలో విటమిన్లు, ముఖ్యంగా బి విటమిన్ లోపం ఉన్నా ఈ సమస్య వస్తుంది.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు..
నెయ్యి లేదా వెన్న రాయాలి..
రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యిని లేదా వెన్నను పెదవుల మూలలపై రాసుకోవాలి. ఇది పెదవులకు తగినంత తేమను అందించి, పగుళ్లను త్వరగా మానేలా చేస్తుంది.

పచ్చి పాలు , మీగడ..
పచ్చి పాలలో కొద్దిగా మీగడ కలిపి పెదవులపై సున్నితంగా మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా మంటను తగ్గిస్తుంది.
తేనె మరియు పసుపు..
కొద్దిగా తేనెలో చిటికెడు పసుపు కలిపి పెదవుల మూలలపై రాసి పది నిమిషాల తరువాత కడిగేయాలి. తేనె చర్మానికి తేమనిస్తే, పసుపు ఇన్ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పగుళ్లను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. రోజులో రెండు మూడు సార్లు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నీరు ఎక్కువగా తాగాలి..
చలికాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అయి పెదవులు పగులుతాయి. అందుకే రోజుకు తగినన్ని నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ఆహారంలో మార్పులు..
శరీరానికి అవసరమైన విటమిన్లు అందేలా ఆకుకూరలు, తాజా పండ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి లోపం లేకుండా చూసుకుంటే పెదవులు పగిలే సమస్య అస్సలు రాదు.
పైన చెప్పుకున్న చిన్నపాటి ఈ జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలోనూ మీ పెదవులు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి.
*రూపశ్రీ.

