ఎంతటి నేరం చేసినా తమకు ఉన్న పలుకుబడితో తిమ్మిని బమ్మిని చేసి శిక్ష నుంచి తప్పించుకునేందుకు రకరకాల మాయలు చేస్తుంటారు డబ్బున్నవాళ్ళు. ఒక హత్య కేసులో బెయిల్ రావడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ హత్య కేసులో ప్రధాన నిందితులైన ప్రియుడు, ప్రియురాలు బెయిల్‌పై బయటికి వచ్చేసి జనంతో కలిసి తిరుగుతున్నారు. ఇలాంటివి మనదేశంలోనే సాధ్యమవుతాయి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు, యావత్ భారతదేశాన్ని కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్రగౌడతోపాటు 15 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్శన్‌కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అతని వెన్నుకు ఆపరేషన్ చేయాల్సి ఉందని అతని తరఫు న్యాయవాది ఒక పిటిషన్ పెట్టడంతో దర్శన్‌కు ఇటీవల బెయిల్ మంజూరు చేశారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే దర్శన్ మాత్రం ఏవో కారణాలు చెబుతూ ఇప్పటివరకు ఆపరేషన్ చేయించుకోలేదు. ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి పవిత్రగౌడకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె జైలు నుంచి బయటికి రాగానే తన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులతో కలిసి వజ్రమునేశ్వర ఆలయానికి పవిత్రంగా వెళ్లి దర్శన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రత్యేక పూజలు చేయించింది. ఇంతటి సంచలనం సృష్టించి ఈ హత్య కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వడానికి అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్య చేశారని స్పష్టమైన ఆధారాలు పోలీసులు సమర్పించారు. మరి వారికి బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.