సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఆణిముత్యాల్లో ఒకరిగా కీర్తి సంపాదించుకున్న సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి. ఆనంద్ శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు. అయితే, లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం ఆయనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంత్యక్రియల నిమిత్తం ఆయన పార్ధివ దేహాన్ని చెన్నై కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికకు నేరుగా ఆయన మృతదేహాన్ని తరలించారు. శ్రద్ధాంజలి ఘటించే నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు అతి తక్కువ సమయం అనుమతించారు.
రెండు వారాల క్రితం కె.వి. ఆనంద్ భార్య, కుమార్తెకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నవారు డాక్టర్ నుంచి చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఆనంద్‌కు శ్వాస సమస్యతో పాటు ఛాతీ నొప్పి వచ్చింది.
దాంతో ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. కొవిడ్-19 లక్షణాలతో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడం, తుదిశ్వాస విడవడం జరిగిపోయింది. టెస్ట్‌లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.
ఆయనకు వైరస్ సోకడంతో, ఆయన పార్ధివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను కార్పొరేషన్ అధికారులే నిర్వహించారు. ఆనంద్ కుటుంబ సభ్యులు కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించేందుకు అనుమతించారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.