కమల్ హాసన్ హీరోగా లెజండరీ డైరెక్టర్ కె. బాలచందర్ రూపొందించిన 'మరో చరిత్ర' (1978) ఎంతటి క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిందో చాలామందికి తెలుసు. కలర్ సినిమాలు వచ్చి రాజ్యం చేస్తున్న కాలంలో బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంటాయి. బాలు, స్వప్న పాత్రలు ఇప్పటికీ మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. విషాదాంత ప్రేమకథాచిత్రమైనప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాని అపూర్వంగా ఆదరించారు. ఆ మూవీతో ఓ నాయిక సినీరంగానికి పరిచయమయ్యారు. ఆమె.. సరిత!
ఆ రోజుల్లో జయప్రద, శ్రీదేవి లాంటి గ్లామరస్ హీరోయిన్లు ఎంతోమంది ఉండగా, వారితో గ్లామర్ విషయంలో ఏమాత్రం సరితూగని సరితను ఎంచుకొని, ఆమెను ఆడియెన్స్‌కు పరిచయం చేశారు బాలచందర్. తొలి సినిమా అయినప్పటికీ స్వప్న పాత్రలో అపూర్వమైన నటన ప్రదర్శించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు సరిత. ఆమెకు ఆ పాత్రను పోషించే అవకాశం ఎలా వచ్చిందనేది ఒక ఆసక్తికర కథ.
సరిత స్వస్థలం గుంటూరు జిల్లాలోని మునిపల్లె. ఆమె అసలు పేరు అభిలాష. సరితగా ఆమె స్క్రీన్ నేమ్ మార్చింది లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్. "తమిళం వాళ్లు అభిలాషను అభిలాసగా పలుకుతారేమోననే ఉద్దేశంతో 'మరో చరిత్ర' ఆడిషన్స్ టైమ్‌లోనే బాలచందర్ గారు, ఆత్రేయ గారు కలిసి సరిత అనే పేరు పెట్టారు. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం 162 మంది అమ్మాయిలకు ఆడిషన్స్ చేసి, నన్ను ఎంచుకున్నారు." అని సరిత స్వయంగా చెప్పారు.
రైటర్ గణేశ్ పాత్రో, సరిత వాళ్ల నాన్నగారు స్నేహితులు. ఒకసారి ఆయన సరిత వాళ్లింటికి వచ్చారు. "ఆ టైమ్‌లో నేను స్కూల్ నుంచి వచ్చి, షూస్ విప్పి లోపలికి వెళ్లిపోయాను. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాను. ఆయన నాకు పదహారేళ్లు ఉంటాయేమోనని అనుకున్నారు. 'ఈ అమ్మాయి బాగుంది. యాక్ట్ చేస్తుందా?' అని నాన్నగారిని అడిగారు. వెంటనే నాన్నగారు నన్ను పిలిచి యాక్ట్ చేస్తావా? అనడిగారు. నేను నో చెప్పి మళ్లీ లోపలికి వెళ్లిపోయాను. ఆయన కమల్ హాసన్ గారి పిక్చర్ అని నాన్నగారితో చెప్పారంట. ఆ విషయం నాకు చెప్పగానే కమల్ హాసనా అని బ్రైట్ అయిపోయాను. నేచురల్‌గానే కమల్ హాసన్ అంటే నాకు క్రష్ ఉండేది. వెంటనే యాక్ట్ చేస్తానని చెప్పేశాను." అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ మరుసటి రోజే ఆమెను ఆఫీసుకు రమ్మన్నారు. "ఆరోజు షాపింగ్‌కు వెళ్లి శారీ, హీల్స్ కొనుక్కున్నాను. బ్లౌజ్‌ను అక్కడి పర్‌ఫెక్ట్ టైలర్స్‌కు ఇచ్చాను. ఇప్పటికీ ఆ టైలర్ నాకు గుర్తున్నారు. శారీ, హీల్స్ వేసుకొని మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లాను. పైనుంచి బాలచందర్‌గారు, ఆత్రేయగారు, ప్రొడ్యూసర్‌గారు, టెక్నీషియన్స్ చూస్తుండగా, కింద ఓ చేత్తో శారీ కాస్త పైకెత్తి పట్టుకొని, ఇంకో చేత్తో హీల్స్ పట్టుకొని మెట్లు ఎక్కుతూ ఆఫీస్‌లోకి వెళ్లాను." అని చెప్పారు సరిత.
మొదట ఆమెను ఓ పాట పాడమనీ, ఆ పాటలో ఎక్స్‌ప్రెషన్స్ చూస్తామనీ చెప్పారు. "రోజారమణి 'కన్నెవయసు' సినిమాలోని ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట పాడాను. ఆ తర్వాత ఓ పేజిన్నర డైలాగ్ ఇచ్చి, పది నిమిషాల్లో ప్రిపేరయి చెప్పమన్నారు. నేను ఐదు నిమిషాల్లోనే ప్రిపేరయి చెప్పాను. వెంటనే నేను సెలక్టయినట్లు చెప్పేశారు. మరుసటి రోజు మేకప్ టెస్ట్‌లో స్విమ్ సూట్ వేసుకోవడం ఓకేనా అనడిగారు. నేను ఓకే అన్నాను. కిస్సింగ్ సీన్స్ ఓకేనా అనడిగాను, నేను ఓకే చెప్పాను. ఆ తర్వాతి రోజే షూటింగ్ కోసం నన్ను కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్ తీసుకెళ్లారు. అదే ట్రైన్‌లో ఫస్ట్ టైమ్ కమల్ హాసన్‌గారిని చూశాను. ఎంత ఎగ్జయిట్ అయిపోయానో.." అని ఆ రోజును గుర్తు చేసుకున్నారు సరిత.