డిసెంబర్ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ గత 15 రోజులుగా కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని తెలుస్తోంది. ఘటన జరిగి చాలా రోజులైనా ఇప్పటివరకు అల్లు అర్జున్‌గానీ, పుష్ప చిత్ర నిర్మాతలుగానీ, మరే ఇతర ప్రముఖులుగానీ శ్రీతేజ్‌ని చూసేందుకుగానీ, రేవతి కుటుంబ సభ్యుల్నిగానీ పరామర్శించడానికి వెళ్ళలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి బుధవారం అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్ళి శ్రీతేజ్‌ను చూశారు. ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఇప్పుడే ఐసియులో ఉన్న శ్రీతేజ్‌ను చూశాను. అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాను. మొదటి నాలుగు రోజుల కంటే గత పదిరోజులుగా అతని పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. అయితే అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు. ఆ అబ్బాయి పూర్తిగా కోలుకోవడానికి మా సైడ్ ఎలాంటి సహాయం చెయ్యడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చూసేందుకు అన్నివిధాలుగా బాధ్యత తీసుకోవడం అభినందనీయం. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు శ్రీతేజ్‌ను చూసేందుకు అల్లు అర్జున్ రాలేదు అని మిత్రులు, సన్నిహితులు, అందరూ అడిగారు. అయితే అతను ఇక్కడికి రాకపోవడానికి కారణం ఉంది. ఘటన జరిగిన మరుసటిరోజే అర్జున్ వస్తానని చెప్పాడు. కానీ, కిమ్స్ డాక్టర్లు నివారించారు. అంతకుముందు రోజే ఘటన జరిగింది కాబట్టి ఈ సమయంలో మీరు వస్తే మళ్ళీ ఏదైనా జరగరానిది జరగొచ్చు అన్నారు. నాకు కూడా నిజమే అనిపించింది. అయితే అదే రోజు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఆ సందర్భంగా మాలీగల్ టీమ్ హెడ్ నిరంజన్‌గారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను కలవడంగానీ, వారి కుటుంబ సభ్యులను కలవడం గానీ చెయ్యొద్దని గట్టిగా చెప్పారు. దీంతో అతనికి రావడానికి వీలు పడలేదు. అలాగే మేం కలవాలన్నా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ ఒకరోజు నాతో ఏమన్నాడంటే నేను చూడడానికి ఎలాగూ వీలు పడడం లేదు. మీరైనా వెళ్లి చూడండి డాడీ అని అడిగాడు. అప్పుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. శ్రీతేజ్‌ను చూసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. నాకు పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారికి, పోలీస్ శాఖకు, కిమ్స్ హాస్పిటల్ అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.