యూట్యూబర్‌గా మంచి పేరు తెచ్చుకొని ఆమధ్య విడుదలైన ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా అరెస్ట్ అయ్యాడు. తనను కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి ప్రసాద్ బెహరాను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈరోజు కోర్టులో హాజరుపరచగా ప్రసాద్ బెహరాకు 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిపై 460, 75(2), 79, 351(2)బిఎన్‌ఎస్, సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ప్రసాద్ బెహరాతోపాటు బాధితురాలు ఓ మీడియా హౌస్‌లో పనిచేస్తోంది. ఇద్దరూ కలిసి షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లలో కలిసి నటించారు. ప్రసాద్ బెహరా ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చింది. ప్రసాద్, బాధితురాలు తరచూ షూటింగ్స్‌లో పాల్గొంటారు. ఆ సమయంలో తనను అసభ్యకరంగా తాకడం, అసభ్యకరంగా మాట్లాడడం వంటివి చేస్తున్నాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తనను సంవత్సరంన్నర నుంచి వేధిస్తున్నాడని తెలిపింది. పెళ్లివారమండీ అనే వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు తనను అసభ్యకరంగా తాకడమే కాకుండా, యూనిట్ అందరూ చూస్తుండగానే తనపై పడ్డాడని, ఆ తర్వాత తనను తాకరాని చోట గట్టిగా చరిచాడని తెలిపింది. అది చూసి యూనిట్‌లోని వారంతా నవ్వారని తెలియజేసింది. దాంతో వెబ్ సిరీస్ నుంచి తాను వచ్చేశానని, చాలా నెలల తర్వాత తనకు క్షమాపణ చెప్పడంతో షూటింగ్ కంటిన్యూ చేశానని పేర్కొంది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, అంతకుముందు కంటే ఎక్కువ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, అసహ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తెలిపింది. డిసెంబర్ 11న మెకానిక్ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు అతని ప్రవర్తన తారాస్థాయికి చేరిందని, అది తట్టుకోలేక ఫిర్యాదు చేస్తున్నానని తెలియజేసింది.