Home  »  News  »  బాక్సాఫీస్ వార్: ఈ వారం థియేటర్లలో 7 కొత్త సినిమాలు.. విన్నర్ ఎవరు.?

Updated : Aug 13, 2026

ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఈ ఆగష్టు 14, 15 తేదీల్లో ఏడు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో తమిళ హీరోలు సూర్య, విశాల్ సినిమాల నుంచి బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్.. టాలీవుడ్ పక్కా పల్లెటూరి కామెడీ డ్రామాల వరకు ప్రతి ఒక్కరికీ కావాల్సిన వినోదం సిద్ధంగా ఉంది.

ముందుగా ఈ వారం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్.. వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న 'విశ్వనాథ్ & సన్స్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటించగా, రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆగష్టు 14న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇందులో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే పిస్టల్ షూటర్‌గా కనిపిస్తారు. తన కొడుక్కి ఉన్న తీవ్రమైన ఆరోగ్య సమస్య ఓ పెద్ద సవాల్‌గా మారుతుంది. బాబు ఆపరేషన్ కోసం అవయవదాతను వెతుకుతున్న క్రమంలో మ్యాడీ అనే యువతి పరిచయం కావడం, ఆమె రాకతో ఆ తండ్రీకొడుకుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు.

ఇక యాక్షన్ ప్రియుల కోసం ప్రముఖ నటుడు విశాల్ నటించి, స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం 'మకుటం'. ఆర్‌బి చౌదరి నిర్మించిన ఈ చిత్రంలో దుషార విజయన్, అంజలి హీరోయిన్లుగా నటించారు. తమిళ, తెలుగు భాషల్లో ఆగష్టు 14న విడుదలవుతున్న ఈ సినిమాలో విశాల్ మూడు విభిన్న గెటప్పులలో కనిపించి అలరించబోతున్నారు.

మరోవైపు, పక్కా పల్లెటూరి వినోదం కోరుకునే వారి కోసం 'పళ్ళ బురుసు' సిద్ధమైంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పళ్ళ బురుసు(టూత్ బ్రష్) కొనివ్వలేదని కొడుకుపై తండ్రి కేసు వేసే డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూరల్ కామెడీ అండ్ ఎమోషన్స్‌తో ఆగష్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.

సీనియర్ నిర్మాత ఎమ్.ఎస్. రాజు దర్శకత్వం వహించిన మిస్టిక్ థ్రిల్లర్ 'అగధ' కూడా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్ల, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ నటిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ లో ఆధ్యాత్మిక అంశాలతో పాటు భయపెట్టే ఊహించని మలుపులు ఉన్నాయని మూవీ టీమ్ చెబుతోంది.

ఇక బాలీవుడ్ లవర్స్ కోసం ఇమ్రాన్ హాష్మీ, దిశా పటానీ జంటగా నటించిన 'ఆవారాపన్ 2' ఆగష్టు 14న థియేటర్లలోకి వస్తోంది. 2007 నాటి ఐకానిక్ హిట్ 'ఆవారాపన్' కి సీక్వెల్‌గా నితిన్ కక్కర్ దీనిని తెరకెక్కించారు.

హిస్టారికల్ డ్రామాలు, భావోద్వేగ చిత్రాలను ఇష్టపడే వారి కోసం సన్నీ డియోల్ హీరోగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'బట్వారా 1947' ఆగష్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రీతి జింటా, షబానా ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు. 1947 దేశ విభజన నాటి హింసాత్మక పరిస్థితుల మధ్య చిక్కుకున్న ఒక కుటుంబం పడే ఆవేదనను గుండెలకు హత్తుకునేలా చూపించారు.

వీటితో పాటు, స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'హుషార్ పిట్టలు' విడుదలవుతోంది. అన్షు, వాసవి గణేశన్ జంటగా బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ సమర్పిస్తోంది. సమాజంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని మలిచారు.

ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో యాక్షన్, ఎమోషన్, కామెడీ, థ్రిల్.. ఇలా ప్రతి జానర్ లోనూ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

 

 

Viswanath And Sons, Makutam, Pallaburusu, Agadha, Hushar Pittalu

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.