Home  »  News  »  పర్సనాలిటీ రైట్స్ కేసులో జాన్వీ కపూర్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.!

Updated : Aug 12, 2026

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లోని ఆమె ఫ్యాన్ క్లబ్‌లు, పేజీలపై పూర్తిస్థాయిలో 'బ్లాంకెట్ బ్యాన్' విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది.

తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించిన అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు చేస్తున్నారని జాన్వీ కోర్టును ఆశ్రయించారు. దాదాపు 4,000 నుండి 5,000 వరకు ఉన్న వెబ్ లింకులు, సోషల్ మీడియా అకౌంట్లు, ఫ్యాన్ పేజీలను తొలగించాలని ఆమె న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విచారణలో జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం స్పందిస్తూ.. ఏఐ, డీప్‌ఫేక్ ఆధారిత అశ్లీల కంటెంట్ లేదా అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనల కోసం ఫోటోలు వాడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే కేవలం ఆమె పేరు మీద నడుస్తున్న ఫ్యాన్ క్లబ్‌లను, పేజీలను పూర్తిగా బ్లాక్ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది.

పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రశంసలు, మీమ్స్ సాధారణమని, ఫ్యాన్ పేజీలు రకరకాలుగా ఉంటాయని కోర్టు పేర్కొంది. "మీకు అభిమానులు వద్దు అనుకుంటున్నారా? డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కామెంట్లు, విమర్శల నుండి ఎవరూ మినహాయింపు పొందలేరు. ప్రతి ఫ్యాన్ క్లబ్‌ను ఎలా మూసివేస్తారు?" అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

అశ్లీల, అసభ్యకర కంటెంట్ కలిగిన లింకులను, వ్యాపార ప్రయోజనాల కోసం ఆమె చిత్రాన్ని దుర్వినియోగం చేస్తున్న లింకులను మాత్రమే ప్రత్యేకంగా పట్టిక రూపంలో వేరు చేసి సమర్పించాలని జాన్వీ కపూర్ తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. అటువంటి తీవ్రమైన ఉల్లంఘనలపై కచ్చితమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు స్టార్ సెలబ్రిటీలు తమ రూపురేఖలు, గాత్రం, వ్యక్తిగత గుర్తింపును ఏఐ దుర్వినియోగం చేయకుండా కాపాడుకునేందుకు పర్సనాలిటీ రైట్స్ పిటిషన్లు వేస్తున్నారు. అయితే ఫ్యాన్ పేజీలు మరియు భావప్రకటన స్వేచ్ఛ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.