Home  »  News  »  ఆడవాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.. 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్‌లో వెంకీ మామ రచ్చ.!

Updated : Jul 28, 2026

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ఉన్న ప్రత్యేక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కుటుంబ కథా చిత్రం నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేశారు. 

ఇప్పటికే చిట్టిబాబుగా వెంకటేష్ పాత్రను పరిచయం చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు 'స్వర్ణ'గా హీరోయిన్  శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక ప్రోమోను రిలీజ్ చేశారు. 

ఈ గ్లింప్స్‌లో వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో ప్రారంభంలో వెంకటేష్ "ఈ ఆడవాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు" అంటూ నటుడు రఘుబాబుతో చెప్పే వినోదాత్మక డైలాగ్ ఆకట్టుకుంటుంది. 

ఆ తర్వాత బాల్కనీలో ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్న నివేదా పేతురాజ్ ని చూపిస్తూ "అదండి ఆడదంటే.. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి. నా పెళ్ళాం ఉంది ఎందుకు, ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది, మళ్ళీ ఇప్పటిదాకా నవ్వలేదు, ఎప్పుడూ మొహం ఉమ్మని పెట్టుకుంటుంది" అంటూ వెంకీ తనదైన శైలిలో ఫస్ట్రేషన్ వ్యక్తం చేయడం వినోదాన్ని పండించింది.

ఈ గ్లింప్స్‌లో వెంకటేష్ భార్యగా శారీలో ఎంతో పద్ధతిగా కనిపించిన శ్రీనిధి శెట్టి "ఊరుకో నాన్న" అంటూ సిగ్గుపడిపోవడం అభిమానులను అలరిస్తోంది. కమెడియన్ సత్య కూడా ''ఆదర్శ కుటుంబం" అంటూ గ్లింప్స్‌లో మెరవడం విశేషం.

ఇప్పటికే విడుదలైన వెంకటేష్, శ్రీనిధి శెట్టి పాత్రల పరిచయ వీడియోలు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించగా, త్వరలోనే యువినా పార్థవిను ‘సంపూర్ణ’గా, రాజా ప్రజ్వల్ ను ‘సర్వ’గా చిత్ర బృందం పరిచయం చేయనుంది.

త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అక్టోబర్ 2న థియేటర్లలో అడుగు పెట్టనుంది. 

 

 

Aadarsha Kutumbam, Venkatesh, Srinidhi Shetty, Trivikram

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.