![]() |
![]() |

పెద కాపు ఫేమ్ 'బ్రిగిడా సాగా' పెళ్లి, డేటింగ్ గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ఒక తమిళ దర్శకుడితో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కి గురయ్యారు. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ బ్రిగిడా సాగా తన అసలైన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది
ప్రముఖ నటుడు, దర్శకుడు ఆనంద్ రామ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వారి అందమైన ప్రేమ ప్రయాణాన్ని వివరిస్తూ 'చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసే అద్భుతమైన ప్రేమకథలు కేవలం వెండితెరకే పరిమితం అనుకునేదాన్ని. కానీ నా జీవితంలో అంతకంటే అందమైన నిజమైన ప్రేమకథని దేవుడు రాసిపెట్టాడు. ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్న సమయంలోనే నా లాంటి కలలు, ఒకే రకమైన ఇష్టాలు ఉన్న ఆనంద్ రామ్‌ని కలుసుకున్నాను. మొదట మా ఇద్దరి మధ్య స్నేహం ప్రారంభమైం ది. ఆ స్నేహమే కాలక్రమేణా ఎంతో బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది. తామిద్దరూ కేవలం 'ఐ లవ్ యూ' చెప్పుకునే సాధారణ జోడీ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం తోడుండే ఒక పరిపూర్ణమైన బంధమని ఇనిస్టాలో రాసుకొచ్చింది.
2019లో వచ్చిన తమిళ చిత్రం 'అయోగ్య' ద్వారా బ్రిగిడా సాగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'మాస్టర్'లోనూ, ఆర్. పార్తీబన్ తెరకెక్కించిన 'ఇరవిన్ నిళల్'లోనూ కీలక రోల్స్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తెలుగులో శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో వచ్చిన 'సింధూరం' చిత్రంలో నక్సలిజం నేపథ్యంలో సాగే లీడ్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాతనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'పెదకాపు-1'లో కథానాయకుడి లవర్ లక్ష్మి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైంది. ఇండస్ట్రీలో ఒకానొక దశలో శ్రీకాంత్ అడ్డాల, బ్రిగిడా సాగా డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి, కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్‌తో ఆ వార్తలకు పూర్తిగా తెరపడింది.
బ్రిగిడా సాగా మనసు దోచుకున్న ఆనంద్ రామ్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటుడే. హిప్ హాప్ ఆది హీరోగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మీసయ్య మురుక్కు' చిత్రంలో ఆనంద్ రామ్ కీలక పాత్రలో నటించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడు. ఇద్దరి ఆలోచనలు, కెరీర్ గోల్స్ ఒకేలా ఉండటంతో వీరి బంధం మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఈ స్టార్ కపుల్ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

![]() |
![]() |