Home  »  News  »  డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి.. ముఖంపై ఉమ్మేసి దారుణంగా!

Updated : Jun 30, 2026

'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj) ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఆయన భౌతిక దాడికి దిగినట్లు చూపుతున్న ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక సామాన్య కార్మికుడి పట్ల సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున రాంగ్ ఆర్డర్‌తో అఖిల్ రాజ్ నివాసానికి పార్సిల్ తీసుకువచ్చాడు. తన పొరపాటును వెంటనే గ్రహించిన సదరు డెలివరీ బాయ్ అక్కడికక్కడే క్షమాపణలు కోరాడు. అయినప్పటికీ హీరో అఖిల్ రాజ్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఘటనను బాధితుడైన డెలివరీ బాయ్ స్వయంగా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. వైరల్ అవుతున్న ఆ విజువల్స్ ప్రకారం, అపార్ట్‌మెంట్ బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న డెలివరీ బాయ్ వైపు హీరో కోపంతో దూసుకురావడం, అతనిని కొట్టడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది.

అక్కడ ఉన్న హీరో తల్లిదండ్రులు, కొందరు మహిళలు అఖిల్‌ను వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం శాంతించకుండా తీవ్ర స్వరంతో మాట్లాడటం వీడియోలో రికార్డ్ అయింది. ఆగ్రహంతో ఊగిపోతూ డెలివరీ బాయ్‌పైకి అఖిల్ దూసుకెళ్తుండగా, అతని తండ్రి అడ్డుకుని ఆపే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, రికార్డ్ చేసిన వీడియోను వెంటనే డిలీట్ చేయాలంటూ అఖిల్ ఆ డెలివరీ బాయ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. బాధితుడు ఈ దృశ్యాలను చూపిస్తూ నెటిజన్లకు తన ఆవేదనను పంచుకున్నాడు. తాను పొరపాటుకు సారీ చెప్పినా వినకుండా హీరో తనపై పిడిగుద్దులు కురిపించాడని, అంతటితో ఆగకుండా హీరో తల్లి తన ముఖంపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించిందని ఆరోపించాడు. "నేను సారీ చెప్పినా కూడా నన్ను కొట్టడానికి ఎలా వస్తారు?" అంటూ అతను ఆ వీడియోలో ప్రశ్నించాడు.

గతేడాది నవంబర్ లో చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ సినిమా విజయంతో హీరోగా నిలదొక్కుకునేందుకు అఖిల్ రాజ్ శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. కెరీర్ ఎదుగుతోన్న ఇలాంటి కీలక సమయంలో ఒక చిన్న పొరపాటుకు ఇంత అహంకారపూరితంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

అయితే ఈ వివాదంపై కేవలం డెలివరీ బాయ్ వర్షన్ మాత్రమే బయటకు వచ్చింది. హీరో అఖిల్ రాజ్ లేదా వారి కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందిస్తేనే ఈ గొడవకు గల పూర్తి కారణాలు మరియు అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

https://x.com/Theteluguone/status/2071624402631020544






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.