Home  »  News  »  Ranveersingh: డాన్ 3 వివాదం... రణవీర్ సింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

Updated : Jun 3, 2026

 

 

ధురంధర్(Dhurandhar)సిరీస్ తో బాలీవుడ్ లో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న రణవీర్ సింగ్‌(Ranveersingh)పై డాన్ 3 వివాదం నేపథ్యంలో FWICE ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ గత మే 25వ తేదీన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్' (సహాయ నిరాకరణ ఆదేశాలు) జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఆదేశాల ప్రకారం  సినీ పరిశ్రమకి చెందిన ఏ టెక్నీషియన్, కార్మికుడు రణవీర్‌తో కలిసి పనిచేయకూడదనే పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ఇది బాలీవుడ్‌లో రణవీర్ కెరీర్‌ను ఇరకాటంలో పడేసే నిర్ణయం. 

అయితే ఈ కఠిన నిర్ణయంపై రణవీర్ సింగ్ మౌనాన్ని వీడి, జూన్ 2వ తేదీన నేరుగా FWICE సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. వృత్తిపరమైన విషయాలను ఎప్పుడూ గౌరవంగా, పరిణతితో పరిష్కరించుకోవాలని భావించే రణవీర్, లీగల్ నోటీసులతో తన వాదనని  బలంగా వినిపించారు. ఈ ఊహించని పరిణామంతో పరిశ్రమలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ నిర్మాత టీపీ అగర్వాల్ కూడా FWICE నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముంబై సివిల్ కోర్టుని  ఆశ్రయించాడు.

ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరిశ్రమకి  చెందిన ఇతర కీలక అసోసియేషన్లు రంగంలోకి దిగాయి. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (PGI), మరియు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంయుక్తంగా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. ఒక నటుడిపై ఇలాంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడం వల్ల మొత్తం సినీ వ్యవస్థే దెబ్బతింటుందని, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని FWICE పెద్దలను కోరాయి. చిత్ర పరిశ్రమ అంతా ఒకే కుటుంబం లాంటిదని, చిన్న చిన్న గొడవలను కోర్టుల వరకు తీసుకెళ్లడం మంచిది కాదని CINTAA ప్రతినిధులు నొక్కిచెప్పారు.

ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ ,చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ బుధవారం ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేశారు. రణవీర్ సింగ్‌పై విధించిన సహాయ నిరాకరణ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎవరి గెలుపు, ఓటములు లేవని, పరిశ్రమ ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. రణవీర్ పంపిన లీగల్ నోటీసులకు తమ లీగల్ టీమ్ సమాధానం ఇస్తుందని చెబుతూనే, రణవీర్ సింగ్ ఇంకా పెద్ద స్టార్ కావాలని ఆకాంక్షించారు. హీరో, నిర్మాతలు, దర్శకులు అందరూ కలిసి ఒకే టేబుల్‌పై కూర్చుని ఈ 45 కోట్ల వివాదాన్ని సామరస్యంగా ముగించుకోవాలని FWICE పిలుపునిచ్చింది. ఈ ఉపసంహరణతో రణవీర్ సింగ్‌కు బాలీవుడ్‌లో భారీ ఊరట లభించినట్లయింది.

Also read: Peddi: పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు జీవో వెనుక ఉన్న నిర్మాత ఇతనే.. జై బాలయ్య


 రణవీర్ ,ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య ‘డాన్ 3’ వివాదం విషయానికి వస్తే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడం, ప్రొడక్షన్ ఆలస్యం కావడం వంటి సృజనాత్మక విభేదాల వల్లే రణవీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌లో ఉందనీ, కేవలం ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసమే తాము ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామనేది మేకర్స్ వాదన. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.