Home  »  News  »  Peddi: పెద్దికి బిగ్ షాక్: హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ వెనక్కి తీసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ 

Updated : May 30, 2026

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi)ఇంకో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. జూన్ 4 రిలీజ్ డేట్ అయినా మూడవ తారీకు నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే సినిమా రిలీజ్ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఈ చిత్ర నిర్మాణ సంస్థకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 నైజాం ఏరియాలో సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పెద్ది నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ని  చిత్ర బృందం తెలంగాణ హైకోర్టు నుంచి హఠాత్తుగా ఉపసంహరించుకుంది. దీంతో తెలంగాణలో సాధారణ ప్రభుత్వ ధరలకే పెద్ది విడుదల కావడం దాదాపు ఖాయమైపోయింది. సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో, సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని  మేకర్స్ ఈ నెల 15న మరియు 25న రెండు సార్లు రాష్ట్ర హోమ్ సెక్రటరీకి అధికారికంగా వినతిపత్రాలు సమర్పించింది. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, చిత్ర యూనిట్ తరపున యలమంచిలి రవిశంకర్ అత్యవసరంగా తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుద్దాల చలపతిరావు నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై శుక్రవారం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎం.వి. ప్రతాప్ కుమార్ వాదనలు వినిపిస్తూ, టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ అధికారులు సకాలంలో నిర్ణయం తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే, హోమ్ డిపార్ట్‌మెంట్ తరఫు న్యాయవాది మహేష్ రాజే దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే టికెట్ ధరల పెంపునకు సంబంధించిన పలు కేసులు డివిజన్ బెంచ్ మరియు సింగిల్ బెంచ్ల ముందు పెండింగ్‌లో ఉన్నాయని, గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఇప్పుడు అత్యవసరంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే తీవ్ర గందరగోళం నెలకొంటుందని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ దశలో ఎలాంటి అనుకూల ఆదేశాలు ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. పైగా తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. సినిమా జూన్ 4నే థియేటర్లలోకి వస్తుండటంతో, జూన్ 6న జరిగే కోర్టు విచారణ వల్ల చిత్ర యూనిట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ రిలీజ్ ని  వాయిదా వేస్తే  బిజినెస్ పరంగా భారీ నష్టం వాటిల్లుతుందని మైత్రీ మూవీ మేకర్స్ భావించింది. దీంతో కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఈ పిటిషన్‌ని  పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేయగా, అందుకు కోర్టు అనుమతించింది.

Also read: Ntr: కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు..వైరల్ అవుతున్న పూర్తి మ్యాటర్ 

మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘పెద్ది’కి భారీగా టికెట్ రేట్ల పెంపుతో పాటు స్పెషల్ షోలకి  కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3న రాత్రి 8 గంటలకే ఏపీలో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను ఏకంగా జీఎస్టీతో కలిపి 600 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా, మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 125 రూపాయల చొప్పున అదనంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు, రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో మాత్రం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పర్సంటేజ్ సిస్టమ్ విధానంపై పట్టుబడుతుండటం, రేట్ల పెంపునకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కూడా చిత్ర బృందానికి ప్రతికూలంగా మారింది. ఏదేమైనా నైజాం ప్రాంతంలోని మెగా అభిమానులకి, సాధారణ ప్రేక్షకులకి ఎలాంటి అదనపు భారం లేకుండా సాధారణ ధరలకే పెద్దిని చూడటం పెద్ద ఊరట అని చెప్పవచ్చు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.