Home  »  News  »  Ranveer singh: బ్యాన్ విధించిన వేళ పవర్ ఫుల్ అమ్మవారి ఆలయంలో రణ్‌వీర్ సింగ్.. అసలు కారణం ఇదేనా!

Updated : May 26, 2026

ధురంధర్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ ప్రస్తుతం వివాదాలు ముసురుకున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి తీవ్రమైన బహిష్కరణ సెగ, మరోవైపు కోర్టు కేసుల ఒత్తిడితో సతమతమవుతున్న రణవీర్ ఈ రోజు   మంగళవారం తెల్లవారుజామున కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ భక్తుడిలా ముఖానికి మాస్క్ ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ఆలయ సందర్శన కేవలం రణ్‌వీర్ సింగ్ సొంత నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన ఆదేశం కూడా ఉంది.

గతేడాది నవంబర్ 28, 2025న గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్ర జాతీయ అవార్డుల (IFFI) ముగింపు వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ తన 'ధురంధర్' సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజ్ పైకి వచ్చారు. ఆ సమయంలో కన్నడ సంచలన చిత్రం 'కాంతార' హీరో రిషబ్ శెట్టి నటనని  ప్రశంసించే క్రమంలో, రణ్‌వీర్ ఆ సినిమాలో అత్యంత పవిత్రమైన 'భూత కోల' ఆచారానికి సంబంధించిన ఒక సీన్‌ని  స్టేజ్‌పై అనుకరిస్తూ మిమిక్రీ లాగా చేసాడు . దీంతో  కన్నడిగుల మనోభావాలని  తీవ్రంగా గాయపరిచారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది ఫిర్యాదు మేరకు రణ్‌వీర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్లు 196, 299, 302 కింద మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుకు సంబంధించి రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, తనకు ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని, కేవలం రిషబ్ శెట్టి నటనపై ఉన్న అభిమానంతోనే అలా చేశానని స్పష్టం చేస్తూ బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న రణ్‌వీర్ క్షమాపణలను అంగీకరిస్తూ కేసును కొట్టివేయడానికి అంగీకరించారు. అయితే ఒక నిబంధన చేసారు. నాలుగు వారాల వ్యవధిలో మైసూరులోని చాముండీ హిల్స్ పై ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, అక్కడ ప్రాయశ్చిత్త పూజలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే రణ్‌వీర్ సింగ్ ఈ రోజు ఉదయం 7:30 గంటల సమయంలో  గుడికి చేరుకున్నారు.

Also read: silk smitha: సిల్క్ స్మితపై షకీలా సంచలన వ్యాఖ్యలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న అసలు నిజం

సరిగ్గా కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన ఈ సమయంలోనే రణ్‌వీర్ సింగ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'డాన్ 3' సినిమా నుంచి రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల నిర్మాతలకు దాదాపు 45 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆగ్రహించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రణ్‌వీర్ పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ అంటే సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం బాలీవుడ్ కార్మికులు, సాంకేతిక నిపుణులు ఎవరూ ఆయనతో కలిసి పని చేయకూడదనే ఒక రకమైన షాడో బ్యాన్ విధించారు. ఒకవైపు 45 కోట్ల వివాదం, మరోవైపు కోర్టు ఆదేశించిన 4 వారాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రణ్‌వీర్  చాముండేశ్వరి అమ్మవారి  ఆలయ పర్యటనని  అత్యంత రహస్యంగా ముగించారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.