Home  »  News  »  అవినీతిపై దళపతి యుద్ధం.. లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సరికొత్త స్కీమ్!

Updated : May 20, 2026

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికిన స్టార్ హీరో, ప్రస్తుత ముఖ్యమంత్రి దళపతి విజయ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తను పక్కా మాస్ లీడర్ అని నిరూపించుకునేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు ఆయన వేసిన సరికొత్త అడుగు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో అవినీతిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు సీఎం విజయ్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా కనీసం వెయ్యి రూపాయలు లంచం అడిగినా.. దానిని పక్కా ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, అలా నిరూపించిన వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల నగదు బహుమతి అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో లంచగొండి అధికారుల గుండెల్లో వణుకు మొదలైంది.

కేవలం మాటలకే పరిమితం కాకుండా, అవినీతిని కూకటివేళ్లతో పాతరేయడమే లక్ష్యంగా విజయ్ నేతృత్వంలోని పార్టీ వర్గాలు ఈ పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. అలాగే అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ప్రభుత్వ శాఖలపై సీఎం ప్రత్యేక నిఘా వర్గాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజలకు అండగా ఉంటూ, లంచం తీసుకునే వారి ఆట కట్టించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సినిమాల్లో అన్యాయాలపై పోరాడే హీరో పాత్రల్లో మెప్పించిన విజయ్, గత ఏడాది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఘన విజయం సాధించి, కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం పీఠం అధిష్టించిన కొద్ది రోజుల్లోనే ఆయన తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో భారీ నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

ఈ సరికొత్త నిర్ణయంపై అటు దళపతి అభిమానులతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రీల్ హీరో నిజమైన రియల్ హీరోగా మారాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సామాన్యుడికి లంచాల బాధ తప్పించేందుకు ఇంతకంటే మంచి ఐడియా ఉండదంటూ నెటిజన్లు విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సీఎం విజయ్ తీసుకుంటున్న ఇటువంటి సంచలన నిర్ణయాలు రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.