Home  »  News  »  ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు’... సరికొత్త లేడీ ఓరియంటెడ్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Updated : May 18, 2026

తెలుగు చిత్రపరిశ్రమలో తన అద్భుతమైన సాహిత్యంతో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మళ్లీ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సమాజంలో మహిళల ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఒక వినూత్నమైన లేడీ ఓరియంటెడ్ కథాంశంతో ఆయన మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రానికి 'లలిత' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ సినిమాతో సరికొత్త నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు జొన్నవిత్తుల. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ నందిని ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. "గర్ల్‌ఫ్రెండ్‌ అంటే బానిస కాదు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కోసం పోరాడే ఒక సామాజిక నేపథ్యమున్న మహిళ కథగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

కాస్మిక్‌ పవర్ క్రియేట్స్ ఎల్.ఎల్.పి. పతాకంపై పి. సుధీర్‌ రాజు, డి. వైష్ణవి నేహా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నందిని కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. అభిలాష్‌, అఖిల్‌ వివాన్‌ హీరోలుగా పరిచయం అవుతున్నారు. కేవలం దర్శకత్వమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు పాటలను కూడా జొన్నవిత్తుల స్వయంగా సమకూరుస్తుండటం విశేషం.

గతంలో జొన్నవిత్తుల దర్శకత్వం వహించిన 'పెళ్ళాం పిచ్చోడు', 'సోంబేరి' సినిమాలు మంచి వినోదాన్ని పంచాయి. అయితే, ఆ చిత్రాలకు భిన్నంగా ఈసారి ఒక సామాజిక బాధ్యత గల సబ్జెక్ట్‌ను ఆయన ఎంచుకున్నారు. అంతేకాకుండా, గత చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్, గాయకుడు మనో వంటి వారిని సంగీత దర్శకులుగా పెట్టి ప్రయోగాలు చేసిన ఆయన.. ఈ సినిమా కోసం మణి-నాగరాజు అనే మ్యూజికల్ కపుల్‌ను ఎంపిక చేసుకున్నారు. నాగరాజు గారు ప్రసిద్ధ వేణు వాదకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

ఈ చిత్రంలో రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్, డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రష్టి వర్మ ఈ చిత్రానికి నృత్య దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. జొన్నవిత్తుల కలం నుంచి వస్తున్న ఈ సామాజిక చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సినిమా ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మరియు మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.