![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla) రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారని సమాచారం. భారీ లాభాలు వస్తాయన్న ఆశతో పెట్టుబడి పెట్టిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.7.2 కోట్ల విలువైన భూమి వ్యవహారంలో కొందరు కేటుగాళ్లు తనను, తన మేనకోడలు శ్వేతను దారుణంగా మోసం చేశారంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నమ్మించి ముంచేసిన కేటుగాళ్లు
ఈ వివాదం 2019లో మొదలైంది. వికారాబాద్ జిల్లాలోని కడ్మూర్ ప్రాంతంలో లాభదాయకమైన భూమి ఉందని నమ్మించి ఒక ముఠా శ్రీను వైట్లను సంప్రదించింది. భవిష్యత్తులో ఈ భూమికి భారీ ధర వస్తుందని, తక్కువ ధరకే ఇస్తున్నామని ఆశ చూపారు. నిందితులు పక్కా పథకం ప్రకారం ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపించి, ఆ భూమి తమదేనని నమ్మబలికారు. వారి మాటలను నిజమని నమ్మిన దర్శకుడు భారీ మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
అసలు నిజం తెలిసేసరికి అంతా పూర్తి
రిజిస్ట్రేషన్ పూర్తయి, డబ్బులు చేతులు మారిన తర్వాత ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము కొనుగోలు చేసిన భూమికి, అమ్మిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని శ్రీను వైట్ల గుర్తించారు. నకిలీ పత్రాలతో తమను బురిడీ కొట్టించారని ఆలస్యంగా తెలుసుకున్న ఆయన షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 7.2 కోట్లు ఉంటుందని, పక్కా కుట్ర ప్రకారమే తమను మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల రంగ ప్రవేశం
శ్రీను వైట్ల ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఫోర్జరీ డాక్యుమెంట్లను ఎలా సృష్టించారు? ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
శ్రీను వైట్ల కెరీర్ విషయానికి వస్తే..
ఒకప్పుడు టాలీవుడ్లో వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో స్టార్ డైరెక్టర్ గా వెలిగిన శ్రీను వైట్ల, గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన శర్వానంద్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సినిమా పనుల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ భూ వివాదం తెరపైకి రావడం గమనార్హం.
![]() |
![]() |