![]() |
![]() |
అది ఒక దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ నివసించే ప్రజలంతా ‘పులి’ భయంతో వణికిపోతుంటారు. కొందరు వ్యక్తులు పులి బారిన పడి చనిపోతూ ఉన్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సాధారణ వ్యక్తిగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ప్రాంతానికి వచ్చాడు. మనుషుల్ని చంపేది పులి కాదని, పులి పేరుతో మనుషులే ఆ హత్యలు చేస్తున్నారని తన పరిశోధనలో తెలుసుకుంటాడు. అయితే ఆ హత్యలు చేస్తున్నది ఎవరనేది కనిపెట్టే క్రమంలో కొందరు వ్యక్తుల్ని అనుమానిస్తూ వారి గురించి ఆరా తీస్తుంటాడు.
ఆ వ్యక్తులు చనిపోవడానికి కారణం సుమతి అనే ఒక అమ్మాయి అని ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా తెలుస్తుంది. ఆ అమ్మాయిని తన కామ దాహానికి బలి తీసుకున్నాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్. సెక్స్ అనేది అతని బలహీనత. దాని కోసం వివేకాన్ని కూడా చంపుకొని ఎలాంటి దారుణం చెయ్యడానికైనా అతను సిద్ధపడిపోతాడు. పైకి ఒక పెద్ద మనిషిలా అందరికీ కనిపిస్తూ పులి ముసుగులో ఇలాంటి దారుణాలు చేస్తుంటాడు.
పక్షులు చేసే శబ్ధాల్లోనే సంగీతం దాగి ఉందని, దానిపై పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాయాలని అక్కడి కాంట్రాక్టర్ ప్రయత్నిస్తాడు. తన వయసు మీద పడిపోవడంతో ఆ కార్యాన్ని పూర్తి చేసేందుకు సుమతి అనే అమ్మాయిని రంగంలోకి దించుతాడు. పక్షుల శబ్దాలను రికార్డు చేసుకునేందుకు ఆ అమ్మాయి అడవిలోని మూల మూలలకు వెళుతూ ఉంటుంది. దాన్ని అదనుగా చేసుకొని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మరో ముగ్గురి సహకారంతో ఆమెను హింసించి తన కోరిక తీర్చుకుంటాడు. అయితే ఆ క్రమంలో సుమతి చనిపోతుంది. ఆ అమ్మాయిని పులి చంపిందని ఆ ముగ్గురు వ్యక్తులు ఊరిలో ప్రచారం చేస్తారు.
ఇది జరిగిన కొన్నాళ్ళకు ఆ ఊరిలో పులి వల్ల మనుషులు చనిపోతూ ఉంటారు. ఫారెస్ట్ ఆఫీసర్‌కి సహాయం చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు వరసగా చనిపోతారు. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అనే మిస్టరీని చేధించేందుకు ఆ పోలీస్ ఆఫీసర్ గట్టిగా ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలోనే ఫారెస్ట్ ఆఫీసర్ మీద అనుమానం వచ్చి ఒక పథకం ప్రకారం అతను నేరం ఒప్ప్పుకునేలా చేస్తాడు. సుమతి అనే అమ్మాయి చావుకు కారణం తాను, తన అనుచరులు అని ఒప్ప్పుకుంటాడు. కానీ, ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని చెబుతాడు.
అడవిలోని క్రూర మృగాల కంటే మనిషిలోని అదుపులేని కోరికలు, పశుత్వమే అత్యంత ప్రమాదకరమైనవి. ఎవరెన్ని నేరాలు చేసినా, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రోజు ఆ నిజం బయట పడక మానదు. కామాంధుడై ఒక అమాయకురాలి చావుకు కారణమైన ఫారెస్ట్ ఆఫీసర్, అతని అనుచరుల్ని హత్య చేస్తున్నది ఎవరు అనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచేందుకు దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు నిజంగా ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా పేరు ‘అన్వేషణ’.
కార్తీక్, భానుప్రియ, సత్యనారాయణ, శరత్‌బాబు, రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, సుధాకర్, వై.విజయ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. 1985లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాలతో కూడిన ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం Teluguone Cinema ను Subscribe చెయ్యండి.
![]() |
![]() |