టాలీవుడ్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టాప్ హీరోల సినిమాలు ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. అందులోనూ మొదటి వేటు రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పైనే పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సినిమా టికెట్ల రేట్లపై, బెనిఫిట్ షోలపై తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. పుష్ప2 మేనియా తర్వాత సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న సినిమా గేమ్ ఛేంజర్ కావడంతో ఈ సినిమా విషయంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ రేట్లు పెంచకుండా, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని కొందరు నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడికి సూచించారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
గేమ్ ఛేంజర్ చిత్రం మూడేళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి హైప్ రావడం సంగతి అటుంచితే.. కొంత నెగెటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయింది. నిర్మాణం ఆలస్యం కావడం, మధ్యలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు2 డిజాస్టర్ కావడం వంటి అంశాల వల్ల ఓపెనింగ్స్గానీ, టోటల్ కలెక్షన్స్గానీ ఏ స్థాయిలో ఉంటాయి అనేదానిపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వల్ల ఆ సినిమాకి ఇక్కడ ప్రయోజనం చేకూరే అవకాశం కనిపించడం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్ ఉండడం వల్ల చరణ్‌కి ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. మరి అబ్బాయ్ కోసం బాబాయ్ ఏం చెయ్యబోతున్నాడు, సంక్రాంతి పండగ సందర్భంగా చరణ్‌కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అనే చర్చ మొదలైంది. రాష్ట్రంలోని కొన్ని సమస్యల పరిష్కారంలో పవన్‌కళ్యాణ్ చొరవ తీసుకొని ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. మరి అబ్బాయ్ సినిమా విషయంలో ప్రభుత్వానికి బాబాయ్ ఎలాంటి సూచనలు చేయబోతున్నాడు, గేమ్ ఛేంజర్ చిత్రాన్ని గట్టెక్కించడానికి పావులు ఎలా కదపబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.