![]() |
![]() |

అక్కినేని అభిమానులు కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇటీవల అక్కినేని హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలను నమోదు చేస్తున్నాయి. దీంతో త్వరలో విడుదల కానున్న 'కస్టడీ' పైనే అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై పరవాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత నుంచి అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం మొదలైంది. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'థ్యాంక్యూ'పై నాగ చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక 'లాల్ సింగ్ చడ్డా'లో చైతన్య కీలక పాత్ర పోషించగా.. అది కూడా పరాజయం పాలైంది.
మరోవైపు నాగార్జున చాలాకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. గతేడాది ప్రారంభంలో 'బంగార్రాజు' కాస్త ఊరటనిచ్చినట్లు కనిపించినప్పటికీ కొద్ది నెలలకే 'ది ఘోస్ట్' రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై నాగార్జున ఎంతో నమ్మకం పెట్టుకోగా.. ఘోర పరాజయం ఎదురైంది.
ఇలా గతేడాది 'థ్యాంక్యూ', 'ది ఘోస్ట్' రూపంలో రెండు డిజాస్టర్లు అక్కినేని ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది 'ఏజెంట్' రూపంలో అంతకుమించిన డిజాస్టర్ ఎదురైంది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణంగా నిరాశపరిచింది. ఇప్పటిదాకా అఖిల్ హీరోగా ఐదు సినిమాలు చేయగా.. అందులో నాలుగు ఘోర పరాజయాలు ఉన్నాయి. ముఖ్యంగా తాజా చిత్రం ఏజెంట్.. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇలా వరుస డిజాస్టర్లతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య నటించిన 'కస్టడీ' మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అక్కినేని హీరోల పరాజయాలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |