![]() |
![]() |

ప్రస్తుతం ఇండియా లోనే టాప్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఏదైనా భారీ సినిమా చేయాలన్నా, చారిత్రాత్మక సినిమా చేయాలన్నా ముందుగా ఆయన పేరే గుర్తుకొస్తుంది. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు సైతం రాజమౌళి పేరే గుర్తుకు రావడం విశేషం. తాజాగా ఆయన సింధు నాగరికతపై సినిమా చేస్తే బాగుంటుందని రాజమౌళికి సూచించారు. అయితే రాజమౌళి గతంలోనే తనకు ఆ ఆలోచన వచ్చిందని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశానని చెప్పి ఆశ్చర్యపరిచారు.
హరప్పా, మొహంజోదారో తో సహా సింధు లోయ నాగరికతకు చెందిన పలు పట్టణాల చిత్రాలను తాజాగా ఒక నెటిజెన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలుచూసిన ఆనంద్ మహీంద్రా "ఇలాంటి చిత్రాలు మన చరిత్రకు జీవితం పోస్తాయి. మన ప్రాచీన నాగరికత గురించి ప్రపంచానికి తెలిసేలా ఒక సినిమా తీస్తే బాగుంటుంది" అంటూ రాజమౌళిని ట్యాగ్ చేశారు. ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్ కి రిప్లై ఇచ్చిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అవును సార్. ధోలావీరాలో మగధీర షూటింగ్ చేసే సమయంలో శిలాజంగా మారిన ఒక పురాతన చెట్టుని చూశాను. ఆ చెట్టు ద్వారా సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందింది, ఎలా అంతరించింది అని చూపిస్తూ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. కొన్నాళ్ల తర్వాత పాకిస్థాన్ లోని మొహంజోదారోను సందర్శించడానికి చాలా ప్రయత్నించాను.. కానీ అనుమతి నిరాకరించారు" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

రాజమౌళి మాటలను బట్టి చూస్తుంటే 'బాహుబలి' కన్నా ముందే సింధు నాగరికతపై ఓ భారీ చిత్రాన్ని తీయాలనే ఆలోచన ఆయనకు వచ్చిందని అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో అయినా సింధు నాగరికతపై సినిమా తీయాలన్న రాజమౌళి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
![]() |
![]() |