![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన 'వేదాళం'(2015) సినిమాని తెలుగులో 'భోళా శంకర్' పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజిత్ నటించిన మరో చిత్రాన్ని కూడా చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విశ్వాసం'(2019). అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. అంతకుముందు వీరి కలయికలో 'వీరం', 'వేదాళం', 'వివేగం' సినిమాలు వచ్చాయి. 'వీరం' సినిమాను 'కాటమరాయుడు' పేరుతో పవన్ కళ్యాణ్ ఎప్పుడో రీమేక్ చేశాడు. 'వేదాళం'ను 'భోళా శంకర్' పేరుతో చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు 'విశ్వాసం'ను కూడా రీమేక్ చేయడానికి చిరు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.
'భోళా శంకర్' తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాకి వినాయక్ దర్శకుడు అని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. గతంలో వీరి కలయికలో వచ్చిన 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ రెండు కూడా రీమేక్ లే కావడం విశేషం. ఇప్పుడు మూడోసారి కూడా 'విశ్వాసం' రీమేక్ కోసం చేతులు కలపబోతున్నట్లు వినికిడి. మరి గతంలో రీమేక్ లతో రెండుసార్లు మెగాస్టార్ కి హిట్ ఇచ్చిన వినాయక్.. మూడోసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |