![]() |
![]() |

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా ఫ్యాన్స్ పిలుచుకొనే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా అభిమానం. చిరును తన ఫేవరేట్ యాక్టర్స్‌లో ఒకరనీ, తనకు ఇన్‌స్పిరేషన్ అనీ ఆయన చెబుతుంటారు. అంతే కాదు, మల్టీస్టారర్ చేయాల్సి వస్తే టాలీవుడ్ స్టార్లలో తన మొదటి ప్రిఫరెన్స్ మెగాస్టార్‌కే అని ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఒకవేళ ఆయనతో కుదరకపోతే పవన్ కల్యాణ్‌తో నటించడానికి రెడీ అని చెప్పారు ఆమిర్ ఖాన్. అలా మెగా బ్రదర్స్‌పై తన అభిమానం చాటుకున్నారు.
టాలీవుడ్‌లో నటించే అవకాశాలు తక్కువని ఆయనన్నారు. భాష రాకుండా సినిమా చేస్తే క్యారెక్టర్‌లో ఎమోషన్స్ ఆవిష్కరించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. తనను బాగా కదిలించే కథ వస్తే, తెలుగు నేర్చుకొని, తనే డబ్బింగ్ చెప్పుకోగలననిపిస్తే అప్పుడు చేస్తానని ఆమిర్ అన్నారు. సౌత్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా వదులుకోనని ఆయన తెలిపారు.
గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ఆమిర్ నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. 'బాహుబలి' సినిమా రిలీజయ్యాక తాను రాజమౌళిని కలిసిన మాట నిజమే కానీ, తమ మధ్య సినిమా గురించిన డిస్కషన్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రాజమౌళి కలల ప్రాజెక్ట్ మహాభారతం అనే విషయం తెలిసిందే. ఆ సినిమా వాస్తవ రూపం ధరిస్తే అందులో ఆమిర్ నటించే అవకాశాలు లేకపోలేదు. ఆమిర్ ప్రస్తుతం 'ఫారెస్ట్ గంప్' రీమేక్ 'లాల్ సింగ్ చడ్ఢా' చేస్తున్నారు.
![]() |
![]() |