సుకుమార్ డైరెక్షన్లో చేస్తోన్న 20వ సినిమా 'పుష్ప' మూవీ తర్వాత తన 21వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు అల్లు అర్జున్. దాంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి క్లారిటీ వచ్చినట్లయింది. ఎందుకంటే ఆయన తన బ్లాక్‌బస్టర్ మూవీ 'రేసుగుర్రం'కు సీక్వెల్ తీయాలనే ఆలోచనతో ఉన్నాడు. బన్నీతోటే ఆ సినిమా చేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఇంతదాకా క్లారిటీ ఇవ్వని బన్నీ.. ఇప్పుడు తన 21వ సినిమా ఎవరితో చేస్తున్నాడో అనౌన్స్ చేసేశాడు. దీంతో సురేందర్ రెడ్డి మరో యాక్టర్‌ను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే.
మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన 'సైరా.. నరసింహారెడ్డి' 2019 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా క్వాలిటీగా మూవీని తీశాడని పేరొచ్చినా, బాక్సాఫీస్ దగ్గర అది కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలవడం అసంతృప్తిని కలిగించే విషయం. దాని తర్వాత ఇంతదాకా సురేందర్ రెడ్డి తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రాకపోవడం ఆశ్చర్యకరం. 'రేసుగుర్రం' సీక్వెల్ స్క్రిప్ట్‌ను ఆయన ఇప్పటికే రెడీ చేశారని సమాచారం. బన్నీతోటే ఆ సినిమా చేయాలనుకుంటే దాన్ని పక్కనపెట్టి మరో స్క్రిప్టుతో మరో హీరోను వెతుక్కోవాలి. 'రేసుగుర్రం 2' స్క్రిప్టుతోటే ముందుకెళ్లాలనుకున్నా వేరే హీరోను చూసుకోవాల్సిందే. ఆ మరో హీరో రామ్ అని ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్లో 'రెడ్' సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తయిన ఆ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తోంది.
'రెడ్' తర్వాత రామ్ చేసే సినిమాపై ఇంతదాకా ఎలాంటి సమాచారమూ లేదు. అన్నీ కుదిరితే సురేందర్ రెడ్డి డైరెక్షన్లోనే అతను నటించే అవకాశాలున్నాయి. అది 'రేసుగుర్రం' సీక్వెలా లేక ఫ్రెష్ స్క్రిప్టా అనేది త్వరలో తేలనుంది.