Home  »  News  »  ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోవాలి.. టాలీవుడ్‌కు కింగ్ నాగార్జున వార్నింగ్.!

Updated : Jul 21, 2026

టాలీవుడ్ లో ప్రస్తుతం మారుతున్న నిర్మాణ పద్ధతులు, ఆఖరి నిమిషం వరకు కొనసాగే పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లపై అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున, పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తన గళాన్ని విప్పారు. మూవీ క్వాలిటీ కోసం నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మారాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ పోస్ట్ ప్రొడక్షన్ విభాగానికి పరిశ్రమలో ఎంతో అద్భుతమైన పేరు ఉందని కొనియాడిన నాగార్జున, తమ డిపార్ట్‌మెంట్ హెడ్ సివి గారు "సినిమా ఫైనల్ కట్ కనీసం రెండు మూడు వారాల ముందు ఇస్తే మేము అసలైన అవుట్‌పుట్ క్వాలిటీ చూపిస్తాం" అని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే స్వయంగా తాను కూడా 'లెనిన్' సినిమా ఫైనల్ కాపీని విడుదల చేయడానికి కేవలం 2 రోజుల ముందు మాత్రమే వారికి అందించగలిగానని ఓపెన్ గా వేదికపై అంగీకరించారు. ఆఖరి 2 రోజులలోనే తమ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ 2 వారాల కష్టానికి సమానమైన అత్యుత్తమ నాణ్యతను అందించిందని, అదే గనుక 2 వారాల సమయం దక్కి ఉంటే.. అవుట్ పుట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అభిప్రాయపడ్డారు. 

ఇదే క్రమంలో టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరికీ నాగార్జున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సినిమా నాణ్యత పెరగాలన్నా, టెక్నీషియన్ల శ్రమకు సరైన గుర్తింపు దక్కాలన్నా కనీసం 2 వారాల ముందు ఫైనల్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి అప్పగించాలని కోరారు. ఒక నిర్దిష్ట వ్యక్తిని ఉద్దేశించి తాను మాట్లాడటం లేదని, ప్రతీ ప్రతిపాదన, ప్రతీ కరెక్షన్ నొక్కి పట్టి ఆఖరి నిమిషం వరకు వాయిదా వేసే అలవాటులో తాను, తన దర్శకుడు, ఎడిటర్ ఇలా ప్రతీ ఒక్కరం ఉన్నామని సెల్ఫ్ రివ్యూ చేసుకున్నారు.

హాలీవుడ్ సినిమాలు, ఇతర అంతర్జాతీయ చిత్రాల విడుదలను ఉదాహరణగా చూపిస్తూ నాగార్జున కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఉదాహరణకు 'ఒడిస్సీ' లాంటి పెద్ద సినిమాలు సరిగ్గా 1 సంవత్సరం ముందుగానే విడుదల తేదీని ప్రకటిస్తాయని, దానికి తగ్గట్లే ప్రణాళికతో పూర్తి చేస్తాయని తెలిపారు. మరి మనం మాత్రం విడుదల తేదీలు ఇచ్చి ఎందుకు పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. స్వయంగా 'లెనిన్' సినిమా విషయంలో తాను కూడా ముందుగా జూన్ 2026 విడుదల అనుకున్నప్పటికీ, టెక్నికల్ వర్క్ పూర్తికాకపోవడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని 2 వారాలు వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు.

తాను తీసిన 'నిన్నే పెళ్లాడతా', 'అన్నమయ్య' వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల సమయంలో, సినిమా విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే ఫైనల్ ప్రింట్ రెడీగా ఉండి తాము ల్యాబ్‌లలో చూసేవాళ్ళమని వెల్లడించారు. మరి అప్పట్లో సాధ్యమైన ప్రణాళిక ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ఈ మార్పు కేవలం ఒక్కరిది కాదని, పరిశ్రమ ఆరోగ్యం, సినిమాల మనుగడ కోసమే తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని నాగార్జున కుండబద్దలు కొట్టారు.

 

 

Nagarjuna Speech, Lenin Movie Event, Akhil Akkineni, Naga Vamsi

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.