Home  »  News  »  సీఎం విజయ్ పరిపాలనపై యాక్షన్ కింగ్ అర్జున్ సంచలన వ్యాఖ్యలు!

Updated : May 25, 2026

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్ర నటుడు ఇంతటి ఘన విజయాన్ని సాధించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా జరిగిన 'బ్లాస్ట్ జోన్' (Blast Zone) మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja).. సీఎం విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రెస్ మీట్‌లో భాగంగా జర్నలిస్టులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు అర్జున్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి విజయ్‌ను కలవడంపై స్పందించారు. ముఖ్యంగా విజయ్ సీఎం కుర్చీలో కూర్చున్న విధానం, ఆయన శరవేగంగా సాగిస్తున్న పరిపాలన చూస్తుంటే అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘ఒకే ఒక్కడు’ గుర్తుకు వస్తోందని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయంపై అర్జున్ స్పందిస్తూ.. తాను విజయ్‌ని కలిసినప్పుడు స్వయంగా విజయ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని ఒక క్రేజీ సీక్రెట్ బయటపెట్టారు. "నేను సీఎం సీట్ చూసినప్పుడు నాకూ ఫస్ట్ 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చింది సార్.. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అదే ఫీలింగ్ కలిగింది" అని విజయ్ తనతో అన్నట్లు అర్జున్ చెప్పుకొచ్చారు. 

తమ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు, మొన్నటివరకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న తోటి నటుడు ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఇండస్ట్రీ మొత్తానికి గర్వకారణమని అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి ప్రయత్నంలోనే ఇంతటి భారీ విజయం అందుకోవడం మామూలు విషయం కాదన్నారు.

ఇదే తరుణంలో ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, తమిళనాడులో విజయ్ సీఎం కావడం చూస్తుంటే దక్షిణాది ప్రజలు సినీ సెలబ్రిటీలను రాజకీయాల్లో ఓన్ చేసుకుంటున్నారనే చర్చ నడిచింది. దీనిపై స్పందిస్తూ, భవిష్యత్తులో అర్జున్ కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందా? అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అర్జున్ నవ్వుతూ సమాధానమిస్తూ.. తనకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టారు.

రాజకీయాల్లోకి రావాలంటే లోపల ఆ బలమైన సంకల్పం ఉండాలని, సమాజానికి మంచి చేయాలనే కోరిక తనకు ఉన్నప్పటికీ దాన్ని బయట ఉండి కూడా చేయవచ్చని అర్జున్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువని, అంత భారీగా ఖర్చు పెట్టేంత డబ్బు తన వద్ద లేదని, తనకున్న కొన్ని వ్యక్తిగత ప్రిన్సిపల్స్ వల్ల పాలిటిక్స్ తనకు సెట్ కావని తేల్చిచెప్పారు. 

విజయ్ కూడా పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం క్రేజ్, జనాదరణతోనే సీఎం అయ్యారు కదా అని జర్నలిస్టులు గుర్తు చేయగా.. "ఆయనకున్నంత భారీ ఫ్యాన్ బేస్, పేరు నాకు లేదు కదా" అంటూ అర్జున్ చాలా సింపుల్‌గా, హుందాగా సమాధానమిచ్చారు. యాక్షన్ కింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.