ఇప్పుడు సౌత్ ఇండియాలో నటించాలంటే బాలీవుడ్ హీరోలు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఏకంగా స్టార్ హీరోలు సైతం సౌత్ ఇండియన్ చిత్రాలలో నటించడానికి ముందుకు వస్తున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదలయ్యాయి. రెండో భాగంలో సంజయ్‌దత్ నటించడం చాలా ఆసక్తిని కలిగించింది. సంజయ్‌దత్ ఇంతకు ముందు నాగార్జున అభ్యర్ధనపై చంద్రలేఖ అనే చిత్రంలో చిన్న పాత్రలో మెరిశాడు. అలాంటి సంజయ్ దత్ ఇలా ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించడం బాలీవుడ్ స్టార్ల మైండ్ సెట్ మారుతోంది అనే విషయాన్నిస్పష్టం చేస్తోంది. ఆయన కేజీఎఫ్2లో నటించి మంచి పేరుతో పాటు ఆదాయాన్ని కూడా పొందారు. ఇప్పుడు ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ కూడా ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ చిత్రంలో రావణుడి పాత్రను చేయడానికి ఓకే చెప్పారు. ఏకంగా రాముడికి ప్రతినాయకుడైన రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ఓకే చెప్పడంతో తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్న ఎన్టీఆర్ 30 మూవీకి కూడా సైఫ్ అలీఖాన్ ని సంప్రదించారట. ఈ చిత్రంలో హీరో ఎన్టీఆర్ పాత్రకు సరి సమానమైన పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్ర ఉంటుందని, కాబట్టి సైఫ్ అలీఖాన్ అయితే క్రేజ్ పరంగా బాగుంటుందని కొరటాల, ఎన్టీఆర్ భావించారని సమాచారం. ఇప్పటికే హీరోయిన్ గా శ్రీదేవి గారాలపట్టి జాన్వి కపూర్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రానికి సైఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ మంచి ఊపును రేకెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక తాజాగా ఆమిర్ ఖాన్ కూడా తెలుగు చిత్రంలో నటిస్తాడా? అనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే అది కేవలం తెలుగే పరిమితం కాదు పాన్ ఇండియా చిత్రం అని గుర్తుంచుకోవాలి. అందులో ఎన్టీఆర్ నటిస్తే పాన్ ఇండియా పాన్ వరల్డ్ లో కూడా చిత్రానికి ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమిర్ ఖాన్ తన చిత్రాల ద్వారా దేశ విదేశాలలో ఎంతో మంచి నటునిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో 'లగాన్' మూవీ ద్వారానే ఆయన ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇంకా 'రంగ్ దే బసంతి', '3 ఇడియట్స్', 'దంగల్' వంటి ఎన్నో చిత్రాలు విదేశాలలో అత్యద్భుత కలెక్షన్ రాబట్టి ఎంతో గొప్ప విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి ఆమిర్ ఖాన్.. ప్రశాంత్ నీల్ దశకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రంలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇవి రూమర్స్ అని కొంతమంది కొట్టి పారేస్తుంటే.. ఇందులో తోసి పుచ్చడానికి ఏమీ లేదని, సినిమా రంగంలో ఎప్పుడు ఏదైనా సాధ్యమేనని.. కాబట్టి ఎన్టీఆర్ చిత్రంలో ఆమిర్ ఖాన్ నటిస్తే ఆ చిత్రానికి ఇమేజ్ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ దిశగా ప్రశాంత్ నీల్ అడుగులు ముందుకు వేస్తాడా? సంజయ్ దత్ ని ఒప్పించినట్టుగా ఆమిర్ ఖాన్ ని కూడా ఎన్టీఆర్ మూవీలో నటించేందుకు ఒప్పిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్, ఆమిర్ ఖాన్ కలిస్తే అదో అద్భుతం అన్నట్టుగా నిలుస్తుంది అని ఇద్దరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ మొదలైంది. అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.