![]() |
![]() |

కొన్ని కాంబినేషన్లు కేవలం రికార్డుల కోసమే కాకుండా, ప్రేక్షకులలో ఒక సరికొత్త ఊహల ప్రపంచాన్ని సృష్టించడానికి పుట్టుకొస్తాయి. అలాంటి ఒక మైలురాయి లాంటి కలయికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) లది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఈ క్రేజీ కాంబో మళ్లీ పట్టాలెక్కబోతోందని అధికారిక ప్రకటన రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది.
అయితే ఈసారి త్రివిక్రమ్ కలానికి ఉన్న పదును కేవలం ఒక ఫ్యామిలీ డ్రామాకో లేదా కమర్షియల్ యాక్షన్ కో పరిమితం కావడం లేదు. సరిహద్దులు లేని ఒక భారీ కాన్వాస్ పై, దైవత్వంతో కూడిన ఒక అద్భుతమైన పౌరాణిక యుద్ధగాథను ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధభూమి నేపథ్యంలో లార్డ్ మురుగన్ ఆయుధమైన శక్తివంతమైన ఈటె, మానవ డిఎన్ఏ ఆకృతితో ముడిపడి ఉన్న దృశ్యం ప్రేక్షకులలో ఎన్నో సరికొత్త ఆలోచనలను రేకెత్తించింది.
తాజాగా అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏకంగా రెండు విభిన్నమైన, అత్యంత శక్తివంతమైన దైవిక అవతారాలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తారక్ ఈ సినిమాలో ఒకేసారి తండ్రి మరియు కొడుకులైన పరమశివుడు (Lord Shiva), అలాగే కుమారస్వామిగా (Lord Muruga) ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. "ద సన్... ద ఫాదర్... ఒన్ ఎటర్నల్ లెగసీ" అనే కాన్సెప్ట్ తో నడిచే ఈ కథాంశం వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా మారబోతోంది.
త్రివిక్రమ్ రాసుకున్న ఈ అద్భుతమైన కథాంశం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకునేలా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. "ఉత్తరాదిన జన్మించి, మధ్యభారతంలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్న దైవం" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఈ విజువల్ ఎపిక్ కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలలో చూపించిన విశ్వరూపాన్ని తలపిస్తూ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా లార్డ్ శివ, లార్డ్ మురుగన్ పాత్రలలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ రెండు దివ్య అవతారాలలో తారక్ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి!
![]() |
![]() |