'ఆర్ఆర్ఆర్'తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, 'పుష్ప-1'తో స్టార్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరి కలయికలో 2016 లో 'నాన్నకు ప్రేమతో' అనే సూపర్ హిట్ ఫిల్మ్ వచ్చింది. ఏడెనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వీరి కాంబోలో రెండో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' రూపొందుతోంది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మొదట విజయ్ దేవరకొండతో ఉంటుందని భావించారంతా. ఆ తర్వాత రామ్ చరణ్ పేరు ప్రముఖంగా వినిపించింది. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో రాజమౌళి సైతం.. సుకుమార్-రామ్ చరణ్ కలయికలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.
గత ఐదేళ్ళలో ఒక్క 'ఆర్ఆర్ఆర్' సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఆ వెంటనే 'వార్-2'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న 'ఎన్టీఆర్ 31'తో బిజీ కానున్నారు. ఏడాదిన్నర లోపు ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ లో ఉన్నారు. వీటి తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. 'పుష్ప-2'ను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నారు. మరి సుకుమార్ 'పుష్ప-2' తర్వాత నిజంగానే ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా లేక ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా రామ్ చరణ్ తో చేస్తారా? లేక మరో హీరో పేరు తెరపైకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.