కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ కథని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలని శంకర్ భావించారు. అయితే దిల్ రాజు సూచనతో శంకర్ ఈ కథని రామ్ చరణ్ కి చెప్పారు. అలా శంకర్-పవన్ కాంబినేషన్ లో సినిమా మిస్ అయింది. అయితే వచ్చే ఏడాది వీరి కాంబోలో సినిమా రూపొందే అవకాశముందని తెలుస్తోంది. పవన్ కోసం శంకర్ మరో అదిరిపోయే కథని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 'బ్రో', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎన్నికల తర్వాతే ఆయన కొత్త సినిమాలను ప్రకటించే అవకాశముంది. అలా కొత్తగా ప్రకటించే సినిమాల్లో శంకర్ ప్రాజెక్ట్ ముందు వరుసలో ఉంటుంది అంటున్నారు.
శంకర్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్'తో పాటు 'ఇండియన్-2' సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. ఆయన తన పూర్తి దృష్టి పవన్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ కూడా అనుకున్నారట. శంకర్ తన సినిమాలలో ఎక్కువగా సామాజిక అంశాలను చర్చిస్తుంటారు. మరోవైపు పవన్ రియల్ లైఫ్ లో ఎక్కువగా సమాజం గురించి ఆలోచిస్తుంటారు. అలాంటిది ఈ ఇద్దరి కలిసి సినిమా చేస్తే.. కేవలం ప్రకటనతోనే అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు.