స్నేహమంటే ఇదే
posted on Aug 2, 2014
|| స్నేహమంటే ఇదే ||
స్నేహమంటే ... సాగారాకాశాలదే...
యోజనాల దూరంలో ఉన్నా
కల్పాలైనా కలుసుకోకున్నా
క్షితిజం దగ్గర కలిసినట్లనిపిస్తూ
దివారాత్రాలనే భేదం లేకుండా
ఒకదానినొకటి చూసుకుంటుంటాయి
ప్రతిఫలాపేక్ష లేకుండా పలకరిస్తుంది గగనం.
పగలు... కొన్ని వెలుగురేకులు చల్లుతూ
రాత్రి ... గుప్పెడు చల్లనికాంతులు చిలకరిస్తూ
సంద్రం ప్రతిబింబిస్తుంది అంబరాన్ని
పగటి కాంతుల మిలలను చూపుతూ
తారల తళుకుల అందం చూసుకొనే అద్దమౌతూ.
ఆవిరిపూలతో మేఘాలను నిర్మిస్తుంది
కృతజ్ఞతలను మౌనంగా తెలియజేస్తుంది
కమ్మని స్నేహాన్ని కలకాలం నిలుపుకుంటుంది.
స్నేహమంటే పువ్వుదీ...పరిమళానిదే.
మొక్కనుంచి వేరైనా
నిర్దాక్షిణ్యంగా తుంచేసినా
కడదాకా కలిసే ఉంటాయి
వేరుచేయడం అసంభవం.
విడివిడిగా చూడానుకోవడం అసాధ్యం
స్నేహమంటే మనదే...
నీ కన్ను దుఃఖిస్తే నామనసు చమరిస్తుంది
నా మనసు శోకిస్తే నీ గుండె భారమౌతుంది.
ప్రేమలో ఉండే స్వార్ధాన్ని మన స్నేహం జయించింది.
స్నేహంలోని మాధుర్యాన్ని జగతికి చాటి చెప్పింది.
ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్