డాక్టర్ సి. నారాయణరెడ్డి
posted on Jul 19, 2014
డాక్టర్ సి. నారాయణరెడ్డి
- డా.ఎ.రవీంద్రబాబు
నేటి ఆధునిక, అత్యాధునిక సాహిత్య ప్రపంచాలకు వారధి ఆయన. ఎన్నో సాహితీ గవాక్షాలను తెరిచిన తేజోమూర్తి. అపూర్వమైన చిత్ర రాజాలను తన పాటలతో ఊరేగించిన పాటల వీరుడు. విద్యలో, వినయంలో, మాటలో, చేతలో, రాతలో, రూపులో అతనిదో ప్రత్యేకమైన శైలి. అతనే డాక్టర్ సి. నారాయణరెడ్డి. తెలుగు నేలపై సాహితీ వ్యవసాయం చేస్తున్న నిత్యకృషీవలుడు.
కరీనంగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జులై 29, 1931న జన్మించారు నారాయణరెడ్డి. ప్రాథమిక విద్యను గ్రామంలో, మాధ్యమిక విద్యను కరీనంగర్ లో పూర్తి చేశారు. ఆపై హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు - ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ ను పొందారు. అయిుతే ప్రాథమిక విద్య నుంచి బి.ఎ. వరకు ఉర్దూలో చదివినా తెలుగుపై ఉన్న అభిమానమే వారిని నడిపించింది. సాహితీ మూర్తిని చేసింది.
గ్రామంలోని జానపద బాణీలు, సాంస్కృతిక కళారూపాలతో ముడివేయబడిన బాల్యం నారాయణరెడ్డిది. స్వతహాగా భావకుడైన అతనికి వీటి ప్రభావంతో కవిత్వం రాయడం అలవోకగా అబ్బింది. వీరి తొలి కవిత జనశక్తి పత్రికలో అచ్చైంది. 1953లో తొలి నృత్యనాటిక నవ్వనిపువ్వు పాఠకలోకానికి అందించారు. అప్పటి నుంచి ఎన్నో అపూర్వమైన, అమూల్యమైన కవిత్వ ఫలాలాను అందిస్తూనే ఉన్నారు. పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, వచనకవితలు, యాత్రాకథనాలు, నృత్య రూపకాలు, గజళ్లు, విమర్శ, అనువాదం... ... ఇలా ఎన్నో కవితాప్రక్రియలు వారి కలం నుంచి జాలువారి తెలుగునేలను పుణీతం చేశాయి.
రామప్ప
కర్పూర వసంతరాయలు
విశ్వనాథనాయకుడు
నాగార్జున సాగరం
రెక్కల సంతకాలు
మట్టి మనిషీ ఆకాశం
మంటలు-మానవుడు
మధ్యతరగతి మందహాసం
ప్రపంచపదులు
ఇక సాహితీ, విద్యావేత్తగా వీరికొచ్చిన బహుమతులకు లెక్కే లేదు. 1997లో పద్మశ్రీ 1978లో కళాప్రపూర్ణ, 1988లో రామలక్ష్మీ, 1992లో పద్మభూషణ్... ఇలాంటివన్నీ నారాయణరెడ్డి ప్రతిభకు కొలమానాలు లాంటివి. 1989లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీట్ వీరి విశ్వంభర కావ్యానికి వచ్చిది. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి. ప్రపంచంలోని ముఖ్యదేశాలు సందర్శించారు. ఇవన్నీ వారి కృషికి చిన్నపాటి సత్కారాలు మాత్రమే...