ఆత్మాలోచనం
posted on Aug 21, 2013
ఆత్మాలోచనం
- శారదా అశోకవర్ధన్
కడలిలో జీవనానికి కావలసినవన్నీ వున్నాయి. మనిషి అవసరాలలో అతిముఖ్యమైన లవణం దగ్గరి నుంచి,ఆహారానికి పనికొచ్చే చేపలూ, ఎండ్రకాయలూమాత్రమే కాక, ఆడంబరాలకూ, అలంకరణలకూ పనికొచ్చే ఆల్చిప్పలూ,
ముత్యాలూ కూడా ఈ కడలిలోనే దొరుకుతాయి!
అయితే ఆ కడలిలోనే భయంకరమైన మొసళ్ళూ,
తిమింగిలాలూ, సుడిగుండాలూ కూడా వుంటాయి.
అన్నింటినీ గుట్టుగా తన గర్భంలోనే దాచుకుని గంభీరంగా
నిరంతర ప్రయాణం సాగిస్తూనే వుంటుంది సాగరం!
కాలం కూడా అంతే! జీవితమూ అంతే!
కాలానికీ, జీవితానికీ మధ్య ఎన్నో తీపి గుర్తులు!
ఎన్నో మధుర స్మృతులు!
ఎన్నో విషాద గాథలు!
ఎన్నెన్నో కన్నీటి కధలు!
సముద్రం సత్యం!
కాలం నిత్యం!
జీవితం అనంతం!
కాలమనే కడలిని తరిచి చూసి పరిశోధించి
గమ్యాన్ని చేరుకోవడం మానవుని దృక్పధం!
కాలం కడలిలో పయనించడం, సముద్రంలో
ఈత కొట్టడం!! పదండి పోదాం!....