మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? విభావరి శిరూర్కర్ (మాలతీ బేడేకర్ )

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

విభావరి శిరూర్కర్ (మాలతీ బేడేకర్ )

 

మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పుట్టంది ఈమె. తండ్రి ఉపాధ్యాయుడు. తన కూతుళ్ళందరూ చదువుకోవాలని ఆశించిన వాడు. ఆమె డిగ్రీ పూర్తి చేసి ప్రిన్సిపాల్గా ఒక గర్ల్స్ స్కూల్లో పనిచేని తరవాత 1937 లో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో (Department of Education and Welfare) చేరుతుంది. ఇక్కడ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ చేత నేరస్తులుగా ముద్రవేయబడి, ఆ కారణంగా బంధింపబడి ఒక ప్రదేశంలో శిక్ష అనుభవిస్తున్న గిరిజనులుండే చోట ఈమె పని చేస్తుంది. వీరి జీవితాల మీద రాసిన నవల ఒకటి వివాదాస్పదమవుతుంది. ఇదే కాదు ఆమె రచనలన్నీ వివాదాస్పదమే. ఎందుకంటే అప్పటివరకూ ఎవరూ రాయని అంశాలన్నిటి మీద, సెక్స్, విధవా వివాహం, వారి హక్కులు, స్త్రీ పురుష సమానత్వం ఇలా అనేక ఇతర అంశాలపై ఆమె రచనలు సాగుతాయి. ఇవన్నీ ఎంత వివాదాస్పదమంటే ఛాందసవాదులు ఆమెని చంపేస్తామని బెదిరించే వరకూ. విభావరి ఆమె కలం పేరు. ఈపేరుతో ఎవరు రాస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ గిరిజనుల జీవితాలపై నవల రాసాకా అది రాసింది తనేనని ధైర్యంగా, పబ్లిక్గా చెపుతుంది. ఆమె అసలు పేరు మాలతి.

ఆమె పేరున్న నవాలా రచయిత, సినిమా నిర్మాత అయిన విశ్రాం బేడేకర్ ని వివాహం చేసుకుంటుంది. మహారాష్ట్ర సాహిత్యంలో ఒక శక్తిమంతమైన స్త్రీ గళం వినిపించిన రచయిత్రి ఆమె. ఆమెకు 1964 లో మహారాష్ట్ర స్టేట్ ఎవార్డ్ వచ్చింది.

మాలతి మొదటీ పుస్తకం కల్యంచి నిష్వస్ (The Sighs of Buds ) 1933 లో అచ్చయ్యింది. ఇది ఒక కధల సంకలనం. అన్నీ కూడా యువతుల గురించి, స్వేఛ్చ కోరుకునే యువతుల గురించి. స్వేఛ్చ తమ తండ్రుల ఇళ్ళనుంచి, కట్నం సంకెళ్ళనుంచి, సమాజం ఆడవారిపై విధించే బంధనాల నుంచి. ఈ కధలు ఆడవారిని ఆర్ధికంగా, శారీరకంగా దొపిడీ చేసే మగవారికి, పురుషాధిక్యతకూ వ్యతిరేకంగా గొంతెత్తి అంతవరకూ ఎవరూ రాయని విధంగా రచింపబడినవి. ఇవి అప్పటి సమాజాన్ని ఎంత షాక్కి గురి చేసాయంటే, రాసిందెవరో తెలియలేదు కానీ, తెలిస్తే చంపేసే వారే. ఆమె తన అసలు వివరాలన్ని తరవాత 1946 లో గాని బయటపెట్టలేదు.

ఆమె రాసిన శబరి అనే నవల సగం ఆత్మ కధేనంటారు. పెళ్ళి అనే బంధంలో చిక్కుకున్న ఒక విద్యావంతురాలైన స్త్రీ, పెద్దలు చేసిన పెళ్ళి లోని ప్రేమా, భంగపాటు, నైరాశ్యం గురించి, జెనరేషన్ గేప్ గురించి, బాధ్యతలు బరువుల గురించి ఎక్కువ సెంటిమెంట్, డ్రామా లేకుండా రాసిన విధానం ఆమె ఉన్న కాలానికి చాలా ముందున్నది. అలాగే ఆమె వివాహం బయట స్త్రీ పురుష సహజీవనాన్ని సమర్ధిస్తూనూ, వివాహం చేసుకోకుండా తండ్రి ఇంటనుండకుండా స్వంతంగా, స్వతంత్రంగా జీవించే హక్కులు ఆడవారికి కావాలని కాంక్షిస్తూ రాసిన రచనలూ కూడా అంతే వివాదాస్పదమయ్యాయి. 1930-40 ల్లో ఆమె ఇంత విప్లవాత్మకమైన భావాలు వెలిబుచ్చితే అప్పటి సమాజం ఇచ్చిన స్పందన అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు, ఇప్పటికీ పెరుమాల్ మురుగన్, అనంత మూర్తి, కలబుర్గిలకి ఎటువంటి స్పందన తిరస్కారాలు లభిస్తున్నాయో, లభించాయో చూసాకా.

1980 లో మరాఠీ సాహిత్యంలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ పనిచేసిన ఒక సాహిత్య సమ్మేళన్ కి ఆమె నాయకత్వం వహించింది. మొత్తంగా ఆమె ఒక పది నవలలు రెండు నాటకాలు రాసింది. రాసింది మరీ ఎక్కువ కాకపోయినా, వాటి లోని కధా వస్తువులు విప్లవాత్మకంగా ఉండటం, సమాజ ధిక్కారం చేయడం, ఎన్నాళ్ళనుంచో పాతుకుపోయిన మూఢాచారాలని, స్త్రీ బానిసత్వాన్ని, పురుషుడి స్వేఛ్చని ప్రశ్నించడం వల్ల స్త్రీవాద రచయిత్రిగా, బలమైన స్త్రీ వాద గొంతుకని వినిపించి మరాఠీ సాహిత్యంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సుస్థిరపరచుకున్నది.

విర్లేలే స్వప్న అనే నవల ఇద్దరు ప్రేమికుల డైరీ ఎంట్రీల్లా మొదలయి అక్కడక్కడా మొనోలొగ్ లాగా సాగుతుంది. ఇందులోని రోహిణి అనే అమ్మాయి అలోచనలు ఎంతో ప్రోగ్రసివ్ గా ఉంటాయి.

"ప్రతి అమ్మాయి తను ప్రేమించిన వాడు అందరికన్నా వేరే అనీ ఎంతో మంచివాడనీ, ఉన్నతుడనీ అనుకుంటుంది. పంచుకునే ఎమోషన్ కన్నా కూడా పంచుకునే అలోచనలే ప్రేమని జీవితాంతం కట్టిపడేస్తాయి. అయినా పెళ్ళి అనే బంధంలో ఒక స్త్రీకి దక్కేదేంటి. పెళ్ళి చేసుకున్న కొంత కాలానికే మగవాడికి ఆమె మీద మోహం పోతుంది. ఆమె బిడ్డల్ని కనే యంత్రంలా వారిని పెంచడంలోనూ, అతని ఇంటిని నడపడంలోనూ మునిగి బంధీ అయి కాస్త స్వేఛ్చ కోసం కొట్టుకుంటూ ఉంటుంది.

అతడు మాత్రం తనకున్న స్వేఛ్చతో బయట తన జ్ఞాన తృష్ణని కానీ, ఇతర మోహ బంధాల్లో కానీ ఆనందం వెతుక్కుంటాడు. అతను డబ్బు తెచ్చివ్వడంతో అతని బాధ్యత అయిపోతుంది. అతను ఆమె చేసే పనికి డబ్బు ఇస్తాడు కానీ అది ఆమె చేసే దానికి ఏమాత్రం సరిపోదు. ఇంత చేసినా ఆమె కెటువంటి స్వతంత్రం ఉండదు. అతనిమీద ఆధారపడాల్సిందే. కానీ అలా అని పెళ్ళి చేసుకోకుండా ఒకరంటే ఒకరికున్న మోహ బంధాన్ని అలానే ఉంచుకుంటే చివిరివరకూ బాగుంటుందా? అప్పుడు మగవాడు స్త్రీని మోసం చెయ్యడని భరోసా ఏమైనా ఉందా? ఈ నిజాలన్నిటికీ కళ్ళు మూసుకుని బ్రతకటం సాధ్యమేనా? అప్పుడు ఈ తెలిసినతనం యొక్క బాధ తప్పుతుందా?” ఇలా అనేక అలోచనలు ఆమె మనసులో తిరుగాడుతుంటాయి.

ఆమె రచనలెన్ని వివాదాలు రేపినా మరాఠీ సాహిత్యంలో ఆమెకు మాత్రం మొట్టమొదటి స్త్రీవాద రచయితల్లో ఒకరుగా ఆమెకు పేరుండిపోయింది.

 

-Sharada Sivapurapu