గుప్పెడు మనసు (కవిత)


గుప్పెడు మనసు

 



చినుకు రాలితే చిగురించిన ఆకుల్లా
మనసు తడికి హృదయమెుకటి కొత్తగా మెులుస్తుంటుంది
ఆవేదనొచ్చినపుడల్లా అత్తిపత్తిలా
ముడుచుకుపోతుంటుంది

మౌనంతోనే అనుక్షణం సంగమిస్తూ
నిరంతరం తలపులతో పురుడు పోసుకుంటూనే ఉంటుంది

పేరుకు గుప్పెడు మాంసపు ముద్దైనా
అంతులేని కలలు ..
కల్లలైన ఆ కలల కోసం కళ్ళలో జలపాతాలు ..

కొన్నిసార్లు ఎగిసి ఎగిసిపడుతున్న ఆశల కెరటాలను మోస్తూ
తీరం చేరని అలల ఆశయాల కోసం
ఆ గుప్పెడే సాగరమంతవుతుంటుంది

కొన్ని ఆటుపోట్లు కుదించివేస్తుంటే
కొన్ని మౌనాలు కలిచివేస్తుంటే
నాకు నేనే అంతుపట్టనంత
శూన్యమవుతుంటుంది

 

 

 

---- సరిత భూపతి